- పట్టువస్త్రాలు సమర్పించిన
- మంత్రి పొన్నం ప్రభాకర్,
- విప్ ఆది శ్రీనివాస్
- భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
- శివుడిని వివాహం చేసుకున్న జోగినులు, శివపార్వతులు,
- హిజ్రాలు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు, వేద పండితులు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించి ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
కన్యదాతలుగా మరిగంటి విజయసారథి కర్ణ దంపతులు వ్యవహరించారు. అనంతరం ఇన్‌చార్జి స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్‌శర్మ,ఉప ప్రధానార్చకులు శరత్ ఆధ్వర్యంలో ఉదయం 10.45 గంటలకు కల్యాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు.
ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయం తరఫున ఈఓ రమాదేవి, మున్సిపాలిటీ తరఫున చైర్‌పర్సన్ పుల్కం రాజు, కమిషనర్ సంపత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తరఫున బీజేపీ లీడర్లు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు లక్ష మందికిపైగా భక్తుల హాజరయ్యారు.
కల్యాణం అనంతరం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములను, పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను రథంపై అధిష్ఠింపజేసి పట్టణంలో ఊరేగించారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గీతే, డీఎస్పీ శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, ఏనుగు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
గతంలో పోరాటం చేశాం, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్
‘వేములవాడ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేశాం.. మేము అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వేములవాడలో సీతారాముల కల్యాణం అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో ప్రజలే చూస్తున్నారన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివాని మొక్కుకున్నానని తెలిపారు.
భద్రాచలం మాదిరిగానే ఇక్కడా నిర్వహిస్తున్నాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భద్రాచలంలో సీతారాముల కల్యాణం ఏ విధంగానైతే జరుగుతుందో.. వేములవాడలోనూ అలాగే నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. గతంలో కల్యాణం జరిగే ప్రదేశం ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవని, వాటిని తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ సారి శివార్చన స్టేజీ పైన రాములవారి కల్యాణం నిర్వహించామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎలాంటి అటంకాలు ఎదురుకాకుండా సంక్షేమం, అభివృద్ధి జరిగేలా సీతారామచంద్రస్వామి ఆశీస్సులు అందించాలని వేడుకున్నామన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసమే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
శివుడిని పెండ్లి చేసుకున్న హిజ్రాలు, జోగినులు
వేములవాడలో జరిగే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు జోగినులు, హిజ్రాలు, శివపార్వతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు సీతారాముల కల్యాణం జరుగుతుండగా.. మరో వైపు హిజ్రాలు ఒకరిపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని, తాళి బొట్టు కట్టుకొని, తలంబ్రాలు పోసుకొని శివుడిని వివాహం చేసుకున్నారు.
