రాజన్న సన్నిధిలో రాములోరి లగ్గం

 రాజన్న సన్నిధిలో  రాములోరి లగ్గం
  •    క్షేత్రానికి భారీగా చేరుకున్న జోగినులు, శివపార్వతులు
  •     కల్యాణానికి ముస్తాబైన శివార్చన వేదిక

వేములవాడ, వెలుగు: హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేడు సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది జోగినిలు, శివపార్వతులు వేములవాడకు చేరుకున్నారు. ఆలయ శివార్చన వేదికపై కల్యాణోత్సవం కోసం విశాలమైన వేదికను అందంగా అలంకరించారు. ఉదయం 11:30 గంటలకు సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం ప్రారంభం కానుంది. భక్తులు కల్యాణ వేడుకను తిలకించేందుకు ప్రత్యేకంగా ఎల్‌‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రథమ చికిత్స కేంద్రాలు, రెస్క్యూ సిబ్బంది, అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్‌‌లు సిద్ధం చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులను ప్రత్యేక జోన్లుగా విభజించారు. కల్యాణోత్సవం అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామని ఈవో రమాదేవి తెలిపారు.

వేములవాడకు జోగినిలు, శివపార్వతులు..

సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న జోగినిలు, హిజ్రాలు, శివపార్వతులు వేములవాడకు తరలివస్తున్నారు. రాములోరి కల్యాణం సందర్భంగా తలంబ్రాలు, ముత్యాలు తీసుకువచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు శివుడిని పెళ్లాడుతూ శివపార్వతులుగా మారడం ఈ క్షేత్రానికి ప్రత్యేకతగా నిలుస్తోంది.

భీమేశ్వరాలయంలో24 గంటల దర్శనం..

సీతారాముల కల్యాణం సందర్భంగా గురువారం రాత్రి నుంచి శనివారం వరకు భీమేశ్వరాలయంలో భక్తులకు 24 గంటలపాటు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లింగార్చనలు తాత్కాలికంగా నిలిపివేస్తామని 
వెల్లడించారు.