ప్రజలు మా వెంటే ఉన్నారు.. ఇలాంటి దాడులకు భయపడం: గువ్వల బాలరాజు

ప్రజలు మా వెంటే ఉన్నారు.. ఇలాంటి దాడులకు భయపడం: గువ్వల బాలరాజు

కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చికిత్స అనంతరం కోలుకొని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ్ అయ్యారు. ఈ సందర్బంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వంశీకృష్న నాపై దాడి చేశారు.. ప్రచారంలో ఉన్న కెమెరాలను ధ్వంసం చేసి మాపై దాడులు చేశారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మాపై దాడి చేశారు.. ఇటువంటి దాడులకు మేం భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలు నాతో ఉన్నారు.. వారి దీవెనల వల్లే బతికి బయటపడ్డాను.. పగ, ప్రతీకారాలు మా సంస్కృతి కాదు.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు గువ్వల బాల రాజు. 

నాపై ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని.. నన్ను ఎదుర్కొనే శక్తి లేక అంతమొందించే కుట్ర చేస్తున్నారని గువ్వల బాలరాజు ఆరోపించారు. నా అనుచరులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు గువ్వల బాలరాజు.. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెపుతాం అని అన్నారు. ఎవరెన్ని దాడులు  చేసిన అచ్చంపేట నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని స్పష్టం చేశారు గువ్వల బాలరాజు. ప్రాణమున్నంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు గువ్వల బాలరాజు.