నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు.. ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ..

నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు.. ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ..

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మంగళవారం ( జనవరి 30) విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. 

హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరేస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేపట్టనుంది. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదాస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.పుప్పాలగూడ 447సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్‌, మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్‌మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు నోరువిప్పుతున్నారు. వారిలో కొందరు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై(Shiva Balakrishna) కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని సర్వీస్‌ నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించిన న్యాయ పరమైన సలహాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఇప్పుడు ఈకేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చచేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు.  ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామి ఆస్తులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్ చేశారు.