గాజుల మధ్యలో గంజాయి అక్రమ రవాణా

గాజుల మధ్యలో గంజాయి అక్రమ రవాణా

గండిపేట, వెలుగు: గాజుల మధ్యలో గంజాయిని పెట్టి ఒడిశా నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్ కు చెందిన ఆరుగురిని రాజేంద్రనగర్ ఎస్ వోటీ, అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన కునాల్ దొర, మహారాష్ట్రకు చెందిన విజయ్‌(36), ప్రదీప్ (26), సత్యనారాయణ(47), సావిత్రి (36), జయా సోలంకి(22), కునాల్‌ దాదారావు(19), ప్రదీప్‌ సాల్వే, బాబా అవస్కర్‌ మొత్తం 9 మంది ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు.

 ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. కునాల్ దొర ఒడిశాలోని బీరంపూర్ ఏజెన్సీ ఏరియాలో గంజాయిని సాగు చేస్తున్నాడు. ఈ గంజాయిని విజయ్ గ్యాంగ్ ఒడిశా నుంచి రైళ్లలో సిటీకి తరలించి ఇక్కడి నుంచి ప్రైవేటు ట్రాన్స్ పోర్టులో మహారాష్ట్రకు తీసుకెళ్లేది. గురువారం రాజేంద్రనగర్ లోని చింతల్ మెట్ వద్ద ఎస్ వోటీ, అత్తాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ డీసీఎంను ఆపి చెక్ చేసి  గాజుల మధ్యలో గంజాయిని గుర్తించారు. 

రూ.22 లక్షల విలువైన 110 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విజయ్, ప్రదీప్, సత్యనారాయణ, సావిత్రి, జయా సోలంకి, కునాల్ దాదారావును అదుపులోకి తీసుకున్నారు. కునాల్ దొర, ప్రదీప్ సాల్వే, బాబా అవస్కర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి  దర్యాప్తు చేపట్టామన్నారు.