ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి.. ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి

ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి.. ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి
  • మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఘటన 
  • ఆక్సిజన్ సమస్య కారణం కాదన్న మంత్రి 

భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో ఆరుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. శనివారం రాత్రి ట్యాంకు నుంచి ఆక్సిజన్ తక్కువ ప్రెజర్ తో సప్లై కావడం వల్లే పేషెంట్లు చనిపోయినట్లు షాదల్ జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ మిలింద్ షిరాల్కర్ వెల్లడించారు. హాస్పిటల్ ఐసీయూలో మొత్తం 62 మంది పేషెంట్లు ఉన్నారని, మిగతా వారంతా సేఫ్ అని తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే హాస్పిటల్ లో లిక్విడ్ ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. ఆక్సిజన్ సప్లయర్స్ కు కంటిన్యూగా ఫోన్లు చేసినా, వెహికల్ రాత్రి ఆలస్యంగా వచ్చిందని, అప్పటికే పేషెంట్లకు ఆక్సిజన్ ప్రెజర్ తగ్గిపోయిందన్నారు. 
ఆక్సిజన్ సమస్య కాదు: మంత్రి 
షాదల్ సర్కార్ దవాఖానలో ఆరుగురు కరోనా పేషెంట్ల మృతికి ఆక్సిజన్ సమస్య కారణం కాదని మధ్యప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విశ్వాస్ కైలాస్ సరంగ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నామని, ఆక్సిజన్ ట్యాంకర్లకు అంబులెన్స్ స్టేటస్ కూడా ఇచ్చామన్నారు.