పని మనుషులుగా చేరి దోపిడీలు

పని మనుషులుగా చేరి దోపిడీలు

హైదరాబాద్‌‌, వెలుగు: పనిమనుషులుగా ఇంట్లో చేరి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 120 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు వివరాలను సీపీ సీవీ ఆనంద్‌‌  మీడియాకు వివరించారు.

హైదరాబాద్​ ఎస్‌‌ఆర్​నగర్​లో వ్యాపారి రామ్‌‌ నారాయణ్‌‌ ఈ నెల 2న ముంబైకి చెందిన మహాదేవి అలియాస్​ సునీత (36)ను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నాడు. మరుసటి రోజు భార్య, పిల్లలతో కలిసి రామ్‌‌ నారాయణ్ బయటకు వెళ్లగా వృద్ధులైన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. గమనించిన మహాదేవి దొంగతనానికి ప్లాన్​ చేసింది. వృద్ధుల కండ్లలో కారం చల్లి  150 తులాల బంగారంతో  పారిపోయింది. ఆటోలో ముందుగా నాంపల్లి రైల్వేస్టేషన్​కు, అక్కడి నుంచి మరో ఆటోలో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు చేరుకుని ముంబైకి వెళ్లి బంగారాన్ని అమ్మేసింది. రామ్‌‌నారాయణ్‌‌  ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తుల నుంచి వివరాలు రాబట్టి ముంబైలో మహాదేవిని అదుపులోకి తీసుకున్నారు.  ఆమె  నుంచి 120 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు చేసేందుకు మహాదేవితోపాటు హైదరాబాద్​కు వచ్చిన పూజా అనే మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు.