- నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కళలు, చేతివృత్తులు, ఇతర నైపుణ్యాల పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్, క్రాఫ్ట్ ,కల్చర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని తెలిపారు.
అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని, విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లే సమయంలో తల్లిదండ్రులు, పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
