ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ కు నైపుణ్య శిక్షణ..ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు

ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ కు  నైపుణ్య శిక్షణ..ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు

పద్మారావునగర్, వెలుగు: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వర్సిటీ విద్యార్థి సేవా విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.బి. వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఆదివారం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ఓపెన్ వర్సిటీ పరీక్షలను అబ్జర్వర్ ఎం.రాజ్యలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బీకాం చదువుతున్న విద్యార్థులకు అకౌంటెంట్ అసిస్టెంట్, జీఎస్టీ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

అలాగే బీఏ, బీఎస్సీతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్, హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. మహిళా విద్యార్థినుల కోసం అడ్వాన్స్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జర్దోజీ వర్క్స్‌‌‌‌‌‌‌‌లో నైపుణ్య శిక్షణ కల్పిస్తామని చెప్పారు. శిక్షణా కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌‌‌‌‌‌‌‌పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లో ఈ శిక్షణ ఉంటుందని డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

ఆసక్తి గల ఓపెన్ వర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.రామాచారి పాల్గొన్నారు.