పుష్ప తరహాలో సండ్ర కర్ర స్మగ్లింగ్.. ఫేక్ ఎన్‌‌ఓసీలతో బార్డర్ దాటిస్తున్న స్మగ్లర్లు

పుష్ప తరహాలో సండ్ర కర్ర స్మగ్లింగ్.. ఫేక్ ఎన్‌‌ఓసీలతో బార్డర్ దాటిస్తున్న స్మగ్లర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడవుల్లో లభ్యమయ్యే సండ్ర కర్ర ఉత్తరాది రాష్ట్రాల్లోని కత్తా ఫ్యాక్టరీలకు త‌‌ర‌‌లుతోంది. కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్​ఆఫీసర్ల కళ్లుగప్పి ఈ సండ్రను సరిహద్దులు దాటిస్తున్నారు. సండ్రను పాన్ మసాలాలో వినియోగించే కత్తా తయారీకి వాడడంతో దీనికి అక్కడ మంచి డిమాండ్  ఉంది. దీంతో స్మగ్లర్లు సండ్ర అక్రమ రవాణాకు తెర తీశారు. ఖమ్మం, మహబూబాబాద్  జిల్లాల కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఫేక్  ఎన్‌‌ఓసీలతో వ్యాపారులు మాయచేస్తున్నారు. 

వేప, తుమ్మ దుంగల పేరుతో పర్మిట్లు సృష్టించి.. లోపల మాత్రం ఖరీదైన సండ్రను లోడ్  చేసి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ లారీ పట్టుబడడంతో పోలీసులు తీగలాగగా.. రాష్ట్ర అటవీ శాఖలోని డొల్లతనం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు పలువురు ఫారెస్ట్​ సిబ్బంది, ఆఫీసర్లపై విచారణ చేపట్టారు. స్మగ్లర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారని తేలడంతో 12 మంది అధికారులపై కొరడా ఝుళిపించారు.

వెలుగులోకి వచ్చిందిలా.. 

మధ్యప్రదేశ్  అటవీ శాఖ అధికారులు రొటీన్  తనిఖీల్లో భాగంగా తెలంగాణ రిజిస్ట్రేషన్‌‌తో వచ్చిన ఓ లారీని అడ్డుకున్నారు. లారీలో వేప ఉందని డ్రైవర్  ఎన్‌‌ఓసీ చూపాడు.  కానీ, లారీ పైభాగంలో కొన్ని వేప దుంగలు ఉన్నప్పటికీ.. లోపల మాత్రం సండ్ర కర్రలు ఉన్నాయి. వెంటనే మధ్యప్రదేశ్  అధికారులు ఆ పత్రాల్లోని సీరియల్  నంబర్ల ఆధారంగా తెలంగాణ అటవీ శాఖను సంప్రదించారు. 

ఇక్కడి అధికారులు రికార్డులు పరిశీలించగా.. అసలు ఆ నంబర్లతో ఎలాంటి పర్మిట్లు జారీ కాలేదని తెలిపారు. దీంతో అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో అప్రమత్తమైన విజిలెన్స్  అధికారులు ఎంక్వైరీ చేయగా అక్రమ ర‌‌వాణా బాగోతం బ‌‌య‌‌ట‌‌ప‌‌డింది. అయితే, సాధారణంగా రైతుల పట్టా భూముల్లో పెరిగే వేప, తుమ్మ, సుబాబుల్, మామిడి వంటి వాటిని నరకడానికి, రవాణా చేయడానికి కఠినమైన నిబంధనలు ఉండవు.

 వీటికి తహసీల్దార్  లేదా డీఎఫ్‌‌ఓ కార్యాలయం నుంచి సాధారణ ఎన్‌‌ఓసీ సరిపోతుంది. అడవిలో పెరిగే టేకు, వెదురు, సండ్ర, జిట్రేగి వంటి వాటికి మాత్రం కచ్చితమైన ట్రాన్సిట్  పర్మిట్ ఉండాలి. కానీ, స్మగ్లర్లు పక్కా ప్లాన్  ప్రకారం వీటిని త‌‌ర‌‌లిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల నుంచి లేదా అక్రమంగా అడవి నుంచి సండ్రను సేకరిస్తారు.  దీనిని రహస్య గోదాముల్లో దాచి రవాణా చేసేటప్పుడు లారీలో కింద సండ్ర దుంగలు పేర్చి, పైన వేప లేదా సుబాబుల్  దుంగలు కప్పుతున్నారు.

నిర్లక్ష్యం వహించిన 12 మందిపై వేటు.. 

మధ్యప్రదేశ్‎లో లారీ పట్టుబడిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ విభాగం విచారణ జరిపింది. ఖమ్మం, మహబూబాబాద్  జిల్లాల్లో చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, పర్మిట్లు జారీచేసే సెక్షన్  ఆఫీసర్ల పాత్రపై ఆరా తీసింది. నకిలీ పత్రాలను గుర్తించడంలో విఫలమయ్యారా? లేక తెలిసే వదిలేశారా? అనే కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. సెక్షన్  ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు 12 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు తేలడంతో వారిపై వేటు వేశారు. 

ఇందులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని సస్పెండ్ చేశారు. మరో ఆరుగురికి చార్జిషీట్లు దాఖలు చేశారు. మరో ఇద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది బడా వ్యాపారులు, ట్రాన్స్‌‌పోర్ట్  ఏజెంట్లు కుమ్మక్కై ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఉత్తరాదికి తీసుకుపోయిన సండ్ర కలపలో దాదాపు మూడింట రెండు వంతులు మధ్యప్రదేశ్ లోని ఒక కత్తా ప్యాక్టరీకి వెళ్లినట్లు సమాచారం.

సండ్ర కట్టెతో కత్తా తయారు.. 

సండ్ర చెట్టు చేవ నుంచి సారాన్ని తీసి దానిని ఉడికించి గడ్డకట్టించడం ద్వారా కత్తా తయారు చేస్తారు. దీనిని పాన్, గుట్కా, ఔషధాల తయారీలో విరివిగా వాడతారు. మన దగ్గర టన్ను సండ్ర ధర తక్కువగా ఉంటే.. హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాసెసింగ్  యూనిట్ల వద్ద ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తున్నారు.