ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు

  ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు
  • ఆలోచించి ఓటేద్దాం
  • ‘వెలుగు’ పేరుతో మరోసారి ఫేక్ సర్వేలు
  • దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ముందూ ఇవే కుతంత్రాలు
  • సొంత విశ్వసనీయత లేకే ‘వెలుగు’ పేరుతో పోస్టులు

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ గ్రూపులు ‘వెలుగు’ దినపత్రిక సర్వే పేరుతో పోస్టులను ప్రచారంలో పెట్టాయి. అధికార పార్టీకి అనుకూలంగా చూపిస్తూ ఈ పోస్టులను లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపించాయి. నిజానికి V6 న్యూస్ చానెల్ గానీ, వెలుగు దినపత్రికగానీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి సర్వేలు చేయలేదు. అయినా ‘వెలుగు’ పేరుతో ప్రచారం చేయడం వెనుక ఓటర్లను తప్పుదోవ పట్టించే పెద్ద కుట్ర కనిపిస్తోంది. ఎందుకంటే ‘వెలుగు’ పేరుతో ఫేక్ సర్వేలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల కింద గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక బైపోల్ టైంలోనూ ఇలాంటి తప్పుడు సర్వేలను ప్రచారంలోకి తెచ్చారు. రెండు సందర్భాల్లోనూ వీటిని ఓటర్లు తిప్పి కొట్టారు. అయినా కుక్క తోక వంకర 
అన్నట్లుగా ఇప్పుడు కూడా ‘వెలుగు’ పేరుతో పెయిడ్ బ్యాచ్ సోషల్ దళారులు తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తున్నారు.

V6 ‘వెలుగు’ పేరే ఎందుకు..

ప్రతిసారీ V6 వెలుగు పేరునే ఫేక్ సర్వేలకు వాడుకోవడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఓటమి ఖరారైందన్న భయంతోనే ఇలాంటి కుతంత్రానికి దిగజారారు. విశ్వసనీయత ఉన్నవాళ్ల పేరుతో ప్రచారం చేస్తే ఓటర్లు నమ్మి నాలుగు ఓట్లేస్తారన్న దివాలాకోరుతనం ఇది. ప్రచారం చేసే లీడర్లకు చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు, చరిత్రలు ఎంత తవ్విపోసినా జనం నమ్మట్లేదని స్పష్టంగా అర్థమైనప్పుడు ఇలాంటి ఫేక్ సర్వేల అవసరం పడుతుంది. అందుకే అధికార పార్టీ పాత ఫార్ములానే నమ్ముకున్నట్లుంది. గులాబీ కీలక నేతకు సన్నిహితుడైన ఓ చోటా లీడర్ నాయకత్వంలో పదుల సంఖ్యలో పెయిడ్, ఫేక్ సోషల్ మీడియా గ్రూపులను నడిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, సమస్యలపై పోస్టులుపెట్టే వారిపై బూతులతో, వ్యక్తిగత కామెంట్లతో దాడులు చేయడం వీళ్ల పని. ఇవన్నీ ఫేక్ అకౌంట్లేనని చాలా సందర్భాల్లో నిరూపణ అయ్యింది. అవే ఫేక్ అకౌంట్లను నమ్ముకొని ఇప్పుడు తప్పుడు సర్వేలను ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయత లేని సొంత లీడర్లు, సొంత మీడియాతో ఎలాంటి ఉపయోగం లేదనే... జనం నమ్మే ‘వెలుగు’ పేరును వాడుకుంటున్నారు. V6 న్యూస్, వెలుగు పత్రికకు విశ్వసనీయత ఒక్కరోజులో వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో మొదలైన V6 న్యూస్ చానెల్ జనం గొంతుకగా నిలిచింది. పార్టీలకు అతీతంగా ఉద్యమగళాలకు పెద్ద వేదికగా మారింది. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని చీల్చిచెండాడింది. జనం ఆకాంక్షలకు, జనం భాషకు, సంస్కృతికి, సామాజిక సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. 

తెలంగాణ సాధన తర్వాత కూడా అదే కట్టుబాటుతో జనం దిక్కు నిలిచింది. అంతులేని జనం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా చానెల్ బాటలోనే జనం పత్రిక ఉండాలన్న లక్ష్యంతో ‘వెలుగు’ దినపత్రికను మొదలుపెట్టింది. మన ప్రజల అవసరాలకు తగిన సమాచారం అందిస్తూ, అందరి గళాలకు వేదికగా అతి తక్కువ కాలంలో వెలుగు పత్రిక ఎదిగింది. అందుకే విశ్వసనీతయకు మారుపేరుగా మన చానెల్, మన పత్రిక నిలిచాయి. ఇది ఏండ్ల తరబడి జనంతో కలిసి, నిలిచి సాధించుకున్న విశ్వసనీయత. ఇది కరువైనవాళ్లే V6, వెలుగు పేర్లను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. దుబ్బాక బైపోల్ సమయంలో V6కు విశ్వసనీయత లేదంటూ అధికార పార్టీ సొంత మీడియాతో ప్రచారం చేయించుకునే స్థాయికి దిగజారింది. దీనికి బైపోల్ ఫలితంతో పాటు అప్పటి కవరేజికి ఇచ్చిన ఆదరణతో ప్రజలే సమాధానం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ V6 సర్వే పేరుతో అధికార పార్టీ పెయిడ్ బ్యాచ్ లు తప్పుడు ప్రచారానికి దిగాయి. రెండోసారి కూడా ప్రజలు దీన్ని తిప్పికొట్టారు. అయినా బుద్ధిమారని దళారి సోషల్ గ్రూపులు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు అదే ప్లాన్ అమల్లో పెట్టాయి. వెలుగు పేరు వాడుకోవడం ద్వారానే క్రెడిబులిటీ ఎవరిదో స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే ఫేక్ ప్రచారాలకు దిగజారడాన్ని బట్టే ఎన్నికల ఫలితంపై భయం పట్టుకున్నట్లు బయటపెట్టుకున్నారు.

పోలీసులు ఎందుకు పట్టుకోరు?

వెలుగు పేరుతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫేక్ సర్వే పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. గతంలోనూ V6 న్యూస్, వెలుగు పత్రికల పేర్లను వాడుకుంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై మా ప్రతినిధులు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పేరుకి కేసు రాసుకుంటున్న పోలీసులు ఈ పోస్టులను తయారుచేస్తున్నవారిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వాడుతూ, దేశంలోనే ఆదర్శ పోలీసులుగా చెప్పుకునే డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు ఎవరు పెడుతున్నారో పట్టుకోలేని స్థితిలో ఉందంటే నమ్మడం కష్టమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా, సమస్యలను బలంగా వినిపించినా పోలీసులు ఊహించని వేగంతో రంగంలోకి దిగడం, పోస్టుల్లో మంచిచెడులతో సంబంధం లేకుండా కేసులుపెట్టి వేధించిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. న్యాయం జరగలేదనీ, ఉద్యోగాలు రాలేదని ఆవేదనతో పోస్టులు పెట్టిన అనేకమంది యువతకు పోలీస్ ట్రీట్ మెంట్ అందింది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు నాసిరకంగా కట్టారని వీడియో ఆధారాలతో పోస్టు పెట్టిన గిరిజన యువకులను సర్కారు పోలీసులు దారుణంగా వేధించారు. ప్రభుత్వానికి ఇబ్బంది అనుకుంటే అన్యాయం అయినా సరే కేసులు పెట్టే పోలీసులు, V6- వెలుగు ఫిర్యాదులపై స్పందించలేకపోవడానికి కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఫేక్ పోస్టుల సృష్టికర్తలు అధికార పార్టీకి దగ్గర మనుషులన్నది స్పష్టంగా తెలుస్తోంది. 

మీ ఓటు.. మీ విచక్షణ.. మీ తీర్పు

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా జనం తీర్పు స్పష్టంగా ఉంటుందని దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే నిరూపించాయి. ఫేక్ సర్వేల ప్రచారంతో మా ఆలోచనలు మార్చలేరని పదేపదే ఓటర్లు చెబుతున్నా గులాబీ ముఖ్య నేతల సోషల్ దళారులకు పశ్చాత్తాపం రావట్లేదు. ఇలాంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోలేని బలహీన స్థితిలో ఉన్నారు. అందుకే నేరుగా ప్రజలకే చెప్పాలని ‘వెలుగు’ భావిస్తోంది. ‘వెలుగు’ పేరుతో వచ్చే ఫేక్ సర్వేలను పాఠకులు ఏ మాత్రం నమ్మవద్దు. చదువుకున్న ఓటర్లుగా సొంత వివేచన, విచక్షణతో ఓటేయాలని కోరుతున్నాం. తప్పుడు పోస్టులు చూసి మోసపోకుండా మీదైన చైతన్యాన్ని చూపిస్తారని ‘వెలుగు’ నమ్ముతోంది. మా మీద మీరు ఉంచిన కొండంత నమ్మకమే మీపైనా మాకుంది.