పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా వాటర్ ట్యాంకర్ఢీ.. హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ మృతి

పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా వాటర్ ట్యాంకర్ఢీ.. హైదరాబాద్లో  సాఫ్ట్ వేర్ మృతి

గచ్చిబౌలి, వెలుగు: స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మణికొండ పుప్పాలగూడలోని బీఆర్​సీ అపార్ట్​మెంట్​లో ఇరువురి శాలిని(38).. భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఐటీ కారిడార్​లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తోంది. 

మంగళవారం (జులై 29) ఉదయం ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకెళ్లి దర్గా ఎక్స్​ రోడ్డు వద్ద స్కూల్​ బస్సు ఎక్కించింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా సుందర్​ గార్డెన్​ వద్ద వెనుక నుంచి వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్టింది. స్కూటీపై నుంచి శాలిని కింద పడగా తల పైనుంచి ట్యాంకర్​ వెళ్లడంతో స్పాట్​లో మృతిచెందింది. రాయదుర్గం పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు లోకేశ్​ ఫిర్యాదుతో ట్యాంకర్​ డ్రైవర్​పై కేసు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్​ వెంకన్న తెలిపారు.

యూటర్న్​ తీసుకుంటుండగా ..

కూకట్​పల్లి: యూటర్న్​ తీసుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్​ మృతిచెందాడు. గోకుల్​ ప్లాట్స్​లో నివసించే దాసరి భీమన్న(62) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కూకట్​పల్లి మెట్రో పిల్లర్​ నంబర్​ 732 వద్ద యూటర్న్​ తీసుకుంటున్నాడు. మియాపూర్​ నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోని ఢీకొట్టడంతో భీమన్న మృతిచెందాడు.