దొంగబాబా అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

దొంగబాబా అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఏసీ క్యాబిన్‌లో జాబ్, వారానికి రెండు రోజులు సెలవు, అయిదంకెల్లో జీతం.. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఉండే కామన్ ఫెసిలిటీస్. వీటికి అలవాటుపడ్డ వారు వీటిని వదులుకోవడానికి అసలు ఇష్టపడరు. అయితే వీటన్నింటికి వదిలి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. బాబాగా అవతారమెత్తాడు. విశ్వ చైతన్య అనే వ్యక్తి వృత్తిరిత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ బోర్ కొట్టిందో లేక ఎక్కువగా సంపాదించాలనుకున్నాడో ఏమో గానీ.. జాబ్ వదిలేసి విశ్వ చైతన్య పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ ఏర్పాటుచేశాడు. ఆ ఛానెల్ ద్వారా తనని తాను బాబాగా పరిచయం చేసుకున్నాడు. నల్గొండ జిల్లాలోని పీఏ పల్లి మండలం, అజ్మాపురంలో పది ఎకరాల స్థలంలో ఓ ఆశ్రమం ఏర్పాటుచేశాడు. రోగాలు నయం చేస్తానంటూ.. హోమాలు చేస్తూ.. ప్రజలను నమ్మించాడు. ఈ విధంగా కొంతకాలం నుంచి ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. రోగాల నయం, హోమాల పేరుతో భక్తుల నుంచి లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదుతో బాబా బాగోతాలు బయటకు వచ్చాయి. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమం నుంచి లక్షల్లో నగదు, నగలు, కోట్ల విలువ గల ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.