హైదరాబాద్ మియాపూర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు కొందరు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్ వేర్ యువకులను ఇవాళ మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 1.5 లక్షల విలువచేసే 12.6 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు నుంచి తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తోంది ఈ ముఠా. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్ వినియోగిస్తున్న మహేష్, ఆదర్శ్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. డ్రగ్స్ కట్టడికి ఈగల్ అనే ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రాకుండా ఉండేందుకు నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఎంత నిఘా ఉంచినా అక్రమ మార్గంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు కొందరు డీలర్లు. యువతను టార్గెట్ గా చేసుకుని దందా కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
