స్మాల్​ సేవింగ్స్​ స్కీములు సీనియర్​ సిటిజెన్లు, మిడిల్​క్లాస్​ కోసమే..

స్మాల్​ సేవింగ్స్​ స్కీములు సీనియర్​ సిటిజెన్లు, మిడిల్​క్లాస్​ కోసమే..

న్యూఢిల్లీ: స్మాల్​ సేవింగ్స్​ స్కీములలో పెట్టుబడి పరిమితిని సీనియర్​ సిటిజెన్లు, మిడిల్​క్లాస్​ప్రజల కోసమే పెంచినట్లు ఫైనాన్స్​ సెక్రటరీ టీ వీ సోమనాథన్​ చెప్పారు. బ్యాంకుల కంటే ఎక్కువ రిటర్న్స్​ ఇవ్వడమే కాకుండా, భద్రత విషయంలోనూ ప్రభుత్వ స్మాల్​ సేవింగ్స్​ బెటరని పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో సీనియర్​ సిటిజెన్స్​ స్కీము కింద మాగ్జిమమ్​ డిపాజిట్​ పరిమితిని అంతకు ముందున్న రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు.  మంత్లీ ఇన్​కం ఎకౌంట్​ స్కీము కింద పరిమితినీ రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు (సింగిల్​ ఎకౌంట్​), రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు (జాయింట్​ఎకౌంట్​) పెంచారు. సీనియర్​ సిటిజెన్స్​ స్కీము పరిమితులను చాలా కాలం నుంచి పెంచలేదు. 

మిడిల్​క్లాస్​, సీనియర్​ సిటిజెన్స్​ సంక్షేమం కోసమే ఈ పరిమితులను ఇప్పుడు పెంచామని ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్యంలోని వ్యక్తులకు సేఫ్టీతో కూడిన ఇన్వెస్ట్​మెంట్​ ఆప్షన్లు ఉండాలని అభిప్రాయం వ్యకమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గతంలో పరిమితులను పెంచిన తర్వాత వారి ఆదాయం చాలా పెరగడంతో సీలింగ్​ను రివ్యూ చేశామని వివరించారు. ఆకర్షణీయమైన వడ్డీతోపాటు, పూర్తి భద్రత ఇచ్చే ఈ స్మాల్​ సేవింగ్స్​ స్కీములలో ఇప్పుడు సీనియర్​ సిటిజెన్లు ఇన్వెస్ట్​ చేసుకోవచ్చని సూచించారు. బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ప్రభుత్వ స్మాల్​ సేవింగ్స్​ స్కీములు ఎక్కువ వడ్డీనే ఇస్తున్నాయని సోమనాథన్​ పేర్కొన్నారు.

పోస్టాఫీసు మంత్లీ ఇన్​కం స్కీముల సీలింగ్​ను 1987 తర్వాత రివైజ్​ చేయలేదు. ఇక సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీము (ఎస్​సీఎస్​ఎస్​) లిమిట్​ను చివరగా 2004 లో రివైజ్​ చేశారు. సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీము కింద ఇచ్చే 8 శాతం  వడ్డీ కంటే తక్కువ వడ్డీకే మార్కెట్లో ప్రభుత్వం ఫండ్స్​ సేకరించే ఛాన్స్​ ఉందని, కానీ  ప్రభుత్వం వారికి బెనిఫిట్​ చేయాలనే ఉద్దేశంతో కొంత భారాన్ని భరిస్తోందని అన్నారు. సీనియర్​ సిటిజెన్స్​కు ఫిక్స్​డ్​ ఇన్​కం ఇన్​స్ట్రమెంట్స్​ నుంచి వచ్చేదే ప్రధానమైన ఆదాయం కావడంతో, వారి వెల్ఫేర్​కోసం తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  

మంత్లీ ఇన్​కం స్కీము..

మిడిల్​క్లాస్​, సీనియర్​ సిటిజెన్స్​ ఎక్కువగా ఇష్టపడే మరో ఇన్​స్ట్రమెంట్​ మంత్లీ ఇన్​కం స్కీము (ఎంఐఎస్​). ఈ స్కీము కిందా సీలింగ్​పెంచాలని నిర్ణయించారు. ఎంఐఎస్​ అనేది 5 ఏళ్ల కాలపరిమితి ఉండే డిపాజిట్​ స్కీము. ప్రస్తుతం ఈ స్కీము కింద 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. వడ్డీ పెంపు ఫలితంగా ప్రభుత్వంపై భారంపడినా, ఇప్పుడున్న పరిస్థితులలో  సీనియర్​ సిటిజెన్స్​కు  మేలు చేయాలంటే ఈ పెంపుదల ఆవశ్యకమని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు సోమనాథన్​ వివరించారు.  స్మాల్​సేవింగ్స్​ స్కీములపై వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులు సీనియర్​ సిటిజెన్స్​ సేవింగ్స్​ స్కీము కింద ఎకౌంట్లను ఓపెన్​ చేసుకోవచ్చు. ఇందులో 5 ఏళ్ల కాలానికి డబ్బును డిపాజిట్​ చేసుకునే వీలుంటుంది.