గ్రానైట్ కంపెనీల జీరో దందా.. బినామీల పేరిట లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు, ఫేక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌, వే బిల్లులతో తరలింపు

గ్రానైట్ కంపెనీల జీరో దందా.. బినామీల పేరిట లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు, ఫేక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌, వే బిల్లులతో తరలింపు
  • జీఎస్టీ ఎగవేతకు గ్రానైట్‌‌‌‌‌‌‌‌ కటింగ్, పాలీషింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్ ఓనర్ల ఎత్తుగడ
  • రూ.16.96 కోట్ల జీఎస్టీ ఎగవేసిన శ్రీకాంత్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌తో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కలకలం 
  • డీజీజీఐ ఆఫీసర్లు దాడులు చేసే వరకు కళ్లు తెరవని కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు: కొందరు గ్రానైట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు నకిలీ వే బిల్లులు, ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లతో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఖజానాకు గండికొడుతున్నారు. కటింగ్, పాలీషింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. కానీ నకిలీ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లు తయారు చేస్తూ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్గొడుతూ జీరో దందా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది.

రూ.100 కోట్ల విలువైన గ్రానైట్‌‌‌‌‌‌‌‌ను బోగస్‌‌‌‌‌‌‌‌ సంస్థ పేరిట ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లు, వేబిల్లుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి రూ.16.96 కోట్ల ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను ఎగవేసిన కేసులో కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వ్యాపారి దాసరి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ను డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్​(డీజీజీఐ) ఆఫీసర్లు ఇటీవల అరెస్ట్ చేయడం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కలకలం రేపింది. గ్రానైట్ కంపెనీల జీఎస్టీ ఎగవేత వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫేక్ ఇన్ వాయిస్‌‌‌‌‌‌‌‌ల వ్యవహారం ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుదోనన్న ఆందోళన వ్యాపారుల్లో నెలకొంది.   

ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌, భార్య ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌తో..
కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన దాసరి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ మనోజ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌‌‌‌‌ పేరిట బోగస్‌‌‌‌‌‌‌‌ సంస్థను ఏర్పాటు చేసి.. దాని ద్వారా రూ.100 కోట్ల విలువైన గ్రానైట్‌‌‌‌‌‌‌‌ను రవాణా చేసినట్లు -వేబిల్లులు జనరేట్ చేశాడు. అయితే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ వివరాలను జీఎస్టీ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడా చూపించలేదు.

శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన ఈ జీరో దందా కారణంగా రూ.16.96 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ ఫేక్‌‌‌‌‌‌‌‌ సంస్థకు శ్రీకాంత్ తన ఫ్రెండ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను లింక్ చేసినట్లు తేలింది. అలాగే నకిలీ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌లు, -వేబిల్లులు జనరేట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు తన భార్య మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ను వినియోగించాడు.

ఆ సంస్థ ప్రొప్రైటర్‌‌‌‌‌‌‌‌గా చూపించిన మనోజారా అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి మాత్రమే అని తేలింది. తాను ఓ కంపెనీకి ప్రొప్రైటర్ గా ఉన్న విషయం తనకే తెలియదని డీజీజీఐ దర్యాప్తులో బహిర్గతమైంది. పాలీషింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌ను నకిలీ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లతో శేరిలింగంపల్లి, ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించినట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఇలా ఇంకా ఎంత మంది జీఎస్టీ ఎగవేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. 

బినామీల పేరిట దందా
కొందరు గ్రానైట్ వ్యాపారులు బినామీల పేరిట జీఎస్టీ లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు తీసుకుని, నకిలీ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లు, వే బిల్లులు క్రియేట్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక వేల లైసెన్స్‌‌‌‌‌‌‌‌ దారుడిని బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చేర్చినా తాము మాత్రం సేఫ్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటామన్న ధీమాతో ఈ దందా కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాసరి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ మాదిరిగానే చాలా మంది ఇతరుల పేరుతో లైసెన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకొని జీఎస్టీని ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రానైట్‌‌‌‌‌‌‌‌ కంపెనీల్లో అమ్మకాలు, కొనుగోళ్లు, సరుకు రవాణాపై నిఘా పెట్టాల్సిన కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు.. డీజీజీఐ ఆఫీసర్లు రంగంలోకి దిగే వరకు కళ్లు తెరవకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు గ్రానైట్ కంపెనీలపై దాడులు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.