టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షులు సౌరవ్ గంగూలీ తన కుటుంబంతో కలిసి లండన్ వీధుల్లో అదిరిపోయే స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిన్న 50వ పుట్టిన రోజును గంగూలీ తన కుటుంబంతో జరుపుకున్నాడు. రాత్రి గంగూలీ కుమార్తె సనాతో పాటు అతని సన్నిహితులు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. గంగూలీ సతీమణి డోనా కూడా స్టెప్పులేశారు. అతడి చుట్టూ ఉన్న వారు కూడా సంతోషంగా చిందులు వేశారు. ఈ స్వీట్ మూమెంట్ ను Vineet Sharma ట్విట్టర్ లో పోస్టు చేశారు. రాజకీయ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సౌరవ్ గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. 1972 జులై 8న కోల్ కతాలో గంగూలీ జన్మించాడు. ఇండియన్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తనదైన శైలిలో జట్టులో ముద్ర వేశాడు. 2000వ సంవత్సరంలో కెప్టెన్ గా నియమిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో మందిని టీంలోకి తీసుకొచ్చాడు. 1992లో అతని ప్రయాణం మొదలైంది. 2002 నుంచి 2005 వరకు టెస్టు జట్టుకు నాయకత్వం వహించాడు. అత్యధిక టెస్టు విజయాలు (21) సాధించి రికార్డు నెలకొల్పాడు. ఇతని నాయకత్వంలోనే 2003 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరింది. కానీ ఫైనల్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2005లో గంగూలీ జట్టుకు దూరమయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ కెప్టెన్సీని అప్పగించింది.
చివరగా.. ఆస్ట్రేలియాతో 2008 చివరి టెస్టు సిరీస్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్ పై 2011లో చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఐపీఎల్లో కొనసాగాడు. 2012లో అన్ని ఫార్మాట్లకు గంగూలీ గుడ్ బై చెప్పాడు. గతంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. తన క్రికెట్ కెరియర్లో గంగూలీ..113 టెస్టులాడి ..7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలున్నాయి. 311 వన్డేల్లో 11 363 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్థ సెంచరీలున్నాయి. ఇక గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 146 వన్డేలాడి 76 మ్యాచ్‌ల్లో గెలిచింది. 65 వన్డేల్లో ఓటమిపాలైంది. దాదా సారథ్యంలో 49 టెస్టుల్లో 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 15 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
