- వెస్టర్లీస్ తక్కువ ఎత్తులో ఉండడమే కారణం
- ఎల్‌నినో ఎఫెక్ట్, ప్రీ మాన్సూన్ షవర్స్ లేకపోవడంతోనూ ప్రభావం
- ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం
- తెలంగాణ సహా మాన్సూన్ కోర్జోన్పై తీవ్ర ప్రభావం
- ఐఎండీ తాజా అంచనాల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు జోరందుకోవడం లేదు. అనుకున్న టైంకు ముందుగానే అరేబియా సముద్రంలోకి ప్రవేశించినా.. వాటికి అక్కడే బ్రేక్ పడిపోయింది. సరైన వేగం లేక మందకొడిగా ముందుకు సాగుతున్నాయి. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారమైనా పట్టొచ్చని ఐఎండీ తాజాగా వెల్లడించింది. వాస్తవానికి నాలుగు రోజులు అటూఇటుగా ఈ నెల 26 నాటికే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది.
ఆ తేదీ దాటి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయినా రుతుపవనాలు మాత్రం ముందుకు కదలడం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నా.. వాతావరణంలోని కొన్ని కారణాలు రుతుపవనాలు ముందుకు కదలనివ్వడం లేదని వెదరాఫీసర్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా, వేగంగా ముందుకు కదలాలంటే పశ్చిమం నుంచి వీచే గాలులు (వెస్టర్లీస్) సరైన ఎత్తులో ఉండాలని అంటున్నారు. వెస్టర్లీస్ కనీసం 4 మీటర్ల ఎత్తులో ఉంటేనే నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకెళ్తాయని,
కానీ, ప్రస్తుతం అవి కేవలం 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. పొడి వాతావరణం ఎక్కువగా ఉండడం, వర్షాకాలానికి ముందొచ్చే వానలు (ప్రీ మాన్సూన్ షవర్స్) లేకపోవడం వంటి కారణాలు కూడా రుతుపవనాల మందగమనానికి కారణమవుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఎల్‌నినో ఎఫెక్ట్ ప్రారంభమవుతుండడం కూడా రుతుపవనాల రాకకు అడ్డుగా మారిందని అంచనా వేసింది. కాగా, మన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 10 నాటికి ఎంటరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
- ఈసారి చాలా తక్కువ వర్షాలే..
రుతుపవనాలు ఆలస్యం అవుతుండడం, ఎల్‌నినో ప్రభావం మొదలవడంతో ఈ వర్షాకాలంలో వానలు చాలా తక్కువగా కురుస్తాయని ఐఎండీ ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన వర్షపాత పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను శుక్రవారం విడుదల చేసింది. కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం లేదని పేర్కొంది. తెలంగాణ, మహారాష్ట్ర సహా మధ్యభారతంలోని మాన్సూన్ కోర్ జోన్ రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
దీర్ఘకాలిక సగటు వర్షపాతమైన 94 శాతం కన్నా తక్కువ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. జూన్‌లో మాత్రం రాష్ట్రంలోని తూర్పు, మధ్య జిల్లాల్లో సాధారణం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంది. అదే సమయంలో ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనాల్లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం చూస్తే.. లోటు వర్షపాతమే ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం మొదలైందని, మాన్సూన్ ఎంటరయ్యాక అది బలపడుతుందని పేర్కొంది. మరోవైపు జూన్‌లోనూ తెలంగాణలోని సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశమున్నట్టు పేర్కొంది.
- 3 జిల్లాల్లో 46.. 7 జిల్లాల్లో 45 డిగ్రీలు
రాష్ట్రంలో శుక్రవారం కూడా టెంపరేచర్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 3 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా, 7 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 46.2, పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్లో 46.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో 45.6, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.4, ఖమ్మం జిల్లా పల్లెగూడెం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట, వరంగల్ జిల్లా కాపులకనపర్తిలలో 45.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆరు జిల్లాల్లో 44 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, గోషామహల్, ముషీరాబాద్ సర్కిళ్లలో అత్యధికంగా 42.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హయత్‌నగర్‌లో 42.1, బేగంపేటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- మాన్సూన్ కోర్ జోన్లో వర్షపాతం అంచనాలు..
వర్షపాత కేటగిరీ సగటు సంభావ్యత
సాధారణం కన్నా తక్కువ <94 43 శాతం
సాధారణం 94 - 106 33 శాతం
సాధారణం కన్నా ఎక్కువ >106 24 శాతం
దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలు..
వర్షపాత కేటగిరీ సగటు వర్షపాతం సంభావ్యత
లోటు <90 60 శాతం
సాధారణం కన్నా తక్కువ >90 - 95 24 శాతం
సాధారణం 96 - 105 14 శాతం
సాధారణం కన్నా ఎక్కువ >105 - 110 2 శాతం
అధిక వర్షపాతం >110 000
