- హెచ్చరించిన ఎస్పీ నితికా పంత్
కాగజ్ నగర్, వెలుగు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్థులు, నాయకులు, ప్రజలు సంయమనం పాటించాలని.. శాంతిభద్రతకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కాగజ్ నగర్లోని పలు కాలనీల్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, మద్యం, డబ్బు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఫ్లాగ్ మార్చ్ లో కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, సురేశ్, రాజు, సందీప్ కుమార్, అనిల్, కళ్యాణ్, సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
