రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

 

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..పరిపూర్ణ కళాకారుడు
  • ఆ మహానుభావుడి గురించి రేపటి తరానికి తెలియాలి: వెంకయ్య నాయుడు 
  • ఆయన ప్రతి పాట.. భావ జలపాతమని ప్రశంస 
  • బాలు.. అజాత శత్రువు: దత్తాత్రేయ 
  • సినీ చరిత్రపై చెరగని సంతకం: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. పరిపూర్ణ కళాకారుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, యాంకర్‌‌‌‌‌‌‌‌గా రాణించారని పేర్కొన్నారు. ఆ మహానుభావుడి గురించి రేపటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ‘ది మ్యూజిక్ గ్రూప్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య (7.2 అడుగులు) విగ్రహాన్ని సోమవారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి సోమవారం వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఈ విగ్రహానికి రూపం పోసిన శిల్పికి ధన్యవాదాలు. బాలు ప్రతి పాట.. ఒక భావ జలపాతం. నేను రోజు ఉదయాన్నే ఘంటసాల, బాలు పాటలు వింటాను. బాలు స్నేహశీలి, మృదుస్వభావి. ఆయన వివిధ రంగాల్లో తన ప్రతిభ చూపించారు. తెలుగు పాటకు ఘంటసాల, బాలు పట్టం కట్టారు. సినీ చరిత్రలో బాలు పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎస్పీ గళం.. సంగీత దర్శకుడు ఏది కోరుకుంటడో అది ఇచ్చే అక్షయపాత్ర. గళంలో వైవిధ్యం చూపడం బాలు  ప్రత్యేకత. ఆయన హాస్యం, సమయస్ఫూర్తి అందరినీ అలరించేది” అని అన్నారు.  

బాలు.. స్వర మాంత్రికుడు: శ్రీధర్ బాబు 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘14 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు బాలు. తరాలు మారినా, ఆయన పాట నిత్యనూతనంగా ప్రతి తెలుగు హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుంది. సంగీత ప్రపంచంలో రారాజుగా.. పాటల పల్లకిలో నెలరాజుగా.. అమర గాయకుడిగా బాలు మనందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం గాయకుడిగా మాత్రమే కాదు... నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మనల్ని అలరించారు. ఆయన గొంతులో పలికిన ప్రతి పాటలో ఒక భావం, ఒక జీవం ఉండేది. ఈ రోజు మనం ఆవిష్కరించుకున్నది కేవలం విగ్రహం మాత్రమే కాదు.. అది సంగీతానికి, నిబద్ధతకు, వినయానికి ప్రతీక” అని శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు పేర్కొన్నారు. బాల సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచమంతటా సుపరిచితుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. 

ఘంటసాల తర్వాత బాలునే : బండారు దత్తాత్రేయ  

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. అజాత శత్రువని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన విగ్రహ ఏర్పాటు తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ‘‘ఎస్పీబీ గాయకుడే కాదు.. సంగీత దర్శకుడు, నటుడు. వివిధ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఘంటసాల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు. శంకరాభరణంలో ఆయన పాడిన శంకరా పాట నా మనసును హత్తుకుంది. పుణ్యభూమి నా దేశం పాట దేశభక్తిని చాటింది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము గీతం వింటే సాక్షాత్తూ వేంకటేశ్వరుడిని చూసినట్టే ఉంటుంది” అని అన్నారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా బాలు ఎంతోమంది గాయనీగాయకులను పరిచయం చేశారని తెలిపారు.