పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ మార్చి 11న తుది తీర్పు ఇచ్చారు.
ఈ ఇద్దరిపై గతవారమే స్పీకర్ విచారణను ముగించి తీర్పును రిజర్వ్ లో పెట్టగా.. ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు. ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. ఇవాళ దానం, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మొత్తం 10 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. మార్చి 12న సుప్రీం కోర్టులో దానం, కడియంల పిటిషన్ లపై విచారణ జరగనుంది.
ఏ తప్పూ చేయలేదు
స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కూడా తన వివరణ తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్ మెంబర్ షిప్ వదులుకోలేదు, వేరే ఏ పార్టీ మెంబర్ షిప్ తీసుకోలేదన్నారు దానం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తన వివరణ అడగలేదు...అసెంబ్లీలో విప్ జారీ చేయలేదని చెప్పారు. సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపిస్తానన్నారు దానం.
10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలలో కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ , దానం, కడియం ఉన్నారు.
