హయత్నగర్కు రంగారెడ్డి కలెక్టరేట్! : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

 హయత్నగర్కు రంగారెడ్డి కలెక్టరేట్! : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి దొరికిన వరమని వెల్లడి

సైఫాబాద్, వెలుగు: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కావడం దేవుడు మనకిచ్చిన వరమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం మసాబ్ ట్యాంక్​లో టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యాలయాన్ని టీఎంఆర్ఈఐఎస్  వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారన్నారు.

అలాగే కొంగరకలాన్​లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ను హయత్ నగర్ పరిసరాల్లోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, కార్యాలయం మార్పు తర్వాత అక్కడ ఉద్యోగ సంఘం భవనానికి స్థల కేటాయింపుతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వం తరఫున చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.