దానం అనర్హత పిటిషన్ పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్

దానం అనర్హత పిటిషన్ పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌పై వేసిన అనర్హత పిటిషన్ విచారణ శనివారంతో ముగిసింది. దీనిపై తీర్పును స్పీకర్ గడ్డం ప్రసాద్ రిజర్వ్ లో పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన అనర్హత పిటిషన్ పై శనివారం సాయంత్రం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఇటు దానం అడ్వకేట్లు అటు మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్ల మధ్య వాదనలు సాగాయి. వీటిని స్పీకర్ రికార్డు చేశారు. ఇప్పటికే దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి కేసులో విచారణ ముగిసింది.

దీంతో దానంపై తుది తీర్పును స్పీకర్ ప్రకటించడమే తరువాయి. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణను స్పీకర్ ముగించి తీర్పును రిజర్వ్ లో పెట్టారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ తన తీర్పును వెల్లడించాల్సి ఉంది. అయితే, ఇద్దరి తీర్పులను ఒకేసారి కాకుండా విడివిడిగా వేర్వేరు రోజుల్లో స్పీకర్ ఈ తీర్పులను వెల్లడించనున్నట్టు సమాచారం. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా.. వాటన్నింటిని విచారించిన స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్  రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ కి స్పీకర్  క్లీన్ చిట్ ఇచ్చారు. దానం, కడియంపై స్పీకర్ ఎలాంటి తీర్పును వెల్లడించనున్నారనే ఉత్కంఠ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది.