హైదరాబాద్, వెలుగు: శైవక్షేత్రాల్లో మాలజంగం వారిని పూజారులుగా నియమించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో మాలజంగాల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాలజంగం మహేశ్వరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్శ శ్యామ్ రావు మాట్లాడుతూ 57 ఎంబీఎస్సీ కులాల ప్రజలకు ఆర్డీవో ద్వారా కాకుండా తహసీల్దార్ నుంచి క్యాస్ట్సర్టిఫికెట్స్ఇవ్వాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి తాలూకా రాజేందర్ మాట్లాడుతూ అన్ని శివాలయాల్లో మాలజంగం వారిని పూజారులుగా నియమించి గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బైరి వెంకటేశం మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాలందరికీ త్వరలో తహసీల్దార్ ద్వారానే కులధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 57 ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో మాలజంగం కుల భవనం నిర్మాణం, నామినేటెడ్ పదవుల్లో మాలజంగాలకు అవకాశం కల్పించాలని కోరారు. మహాసభలో సంఘం ముఖ్య సలహాదారులు రాజాం ఉమాపతి, పురం శివశంకర్, కన్వీనర్ మదారి ఉమాపతితోపాటు నేతలు పాల్గొన్నారు.
