హార్టికల్చర్​ ప్రోత్సాహం కోసం ప్రత్యేక విధానం

హార్టికల్చర్​ ప్రోత్సాహం కోసం ప్రత్యేక విధానం

హార్టికల్చర్​ డెవలప్​మెంట్​ కోసం సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్సీ
జయశంకర్​ వర్సిటీలో 300 ఎకరాల స్థలం..
వచ్చే బడ్జెట్లో ఫండ్స్​ ఇస్తం 
అగ్రి పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు పెంచుతమని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: హార్టికల్చర్ లో మన రాష్ట్రం ఎక్స్‌‌పోర్ట్స్‌‌ చేసే స్థాయికి ఎదగాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. మన రాష్ట్ర అవసరాలు, ఇక్కడి నేలలు, వాతావరణానికి అనుగుణంగా హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు మరింత విస్తరించే దిశగా రీసెర్చ్​ చేపట్టాలని, హార్టికల్చర్  వర్సిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల డెవలప్​మెంట్​కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హార్టికల్చర్  డెవలప్​మెంట్, పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జయశంకర్  యూనివర్సిటీ ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. హార్టికల్చర్  వర్సిటీకి ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కోసం వచ్చే బడ్జెట్లో ఫండ్స్​ కేటాయిస్తామని తెలిపారు. వంటి మామిడి, రామగిరి ఖిల్లా అగ్రి పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్ తరహా ఇంటిగ్రేటెడ్‌‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రైతు బంధుతోపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు

హార్టికల్చర్‌‌ నర్సరీలు నెలకొల్పే రైతులకు, ఉద్యాన పంటలు సాగుచేసేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహాకాలను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పండ్లు, కూరగాయలు, పూల సాగులో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు అందించేందుకు చుట్టుపక్కల ఉండే రైతులను ఎంపిక చేసి, కూరగాయలు, హార్టికల్చర్‌‌ పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు.

హార్టికల్చర్‌‌కు నలుగురు ఉన్నతాధికారులు

ఉద్యానశాఖలో పని విధానాన్ని వికేంద్రీకరించాలని సీఎం అన్నారు. హార్టికల్చర్‌‌కు ఒకే కమిషనర్ ఉన్నారని, ఇక నుంచి పండ్ల తోటల సాగుకు, కూరగాయలు, ఆకుకూరల సాగుకు, పామాయిల్ సాగు కోసం నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని నిర్ణయించారు. డిపార్ట్‌‌మెంట్లో వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని, హార్టికల్చరిస్టులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న కొత్త అగ్రిచట్టాలతో సంబంధం లేకుండా రాష్ట్ర మార్కెట్లను కాపాడుకుందామన్నారు. వీలైనంత మేర పత్తి సాగు పెంచాలన్నారు. ఈ మీటింగ్​లో రైతులకు ఎక్కువ లాభం వచ్చేలా దేశవ్యాప్తంగా సాగవుతున్న వివిధ రకాల ఉద్యాన పంటల సాగుపై చర్చించారు.

ఇంపోర్ట్స్‌‌ నుంచి ఎక్స్‌‌పోర్ట్స్‌‌కు ఎదగాలి

తక్కువ నీటి వినియోగం, తక్కువ కాల పరిమితి ఉండే హార్టికల్చర్‌‌ పంటల సాగుతో రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా అధికారులు సీఎం కేసీఆర్​కు వివరించారు. కూరగాయలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఇక్కడి వాతావరణం హార్టికల్చర్ పంటలకు చాలా అనుకూలమని చెప్పారు. రైతులకు సాగు ఖర్చు పెరిగిపోతోందని.. టెక్నాలజీని అందిపుచ్చుకుని ఖర్చు తగ్గించుకునే దిశగా విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని వ్యవసాయ శాఖ ఉద్యోగులు నమోదు చేసి.. రైతుల సెల్ ఫోన్లకు మెసేజీల ద్వారా పంపిస్తున్నారని, ఈ విధానం దేశంలో మరెక్కడాలేదని సీఎం అభినందించారు.