1.10 కోట్ల ఏండ్ల నాటి స్టెగోడాన్ .. ఏనుగు శిలాజాలతో బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శన

1.10 కోట్ల ఏండ్ల నాటి స్టెగోడాన్ .. ఏనుగు శిలాజాలతో బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శన
  • బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి పెవిలియన్ 
  • ఆవిష్కరించిన సీఎండీ బలరామ్​, బిర్లా సైన్స్​సెంటర్​ చైర్​పర్సన్​ నిర్మల

హైదరాబాద్/బషీర్​బాగ్​, వెలుగు: సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్  గనిలో లభించిన 1.10 కోట్ల ఏండ్లనాటి స్టెగోడాన్  జాతి ఏనుగు అవశేషాలను హైదరాబాద్  బిర్లా సైన్స్ సెంటర్‌‌లో ప్రదర్శించారు. సింగరేణి పెవిలియన్‌‌ను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, జీపీ బిర్లా పురావస్తు, ఖగోళ వైజ్ఞానిక సంస్థ చైర్‌‌పర్సన్  నిర్మల బిర్లా కలిసి ఈ పెవిలియన్ ను ప్రారంభించారు. రామగుండం-1 ఏరియాలోని మేడిపల్లి గనిలో నాలుగేళ్ల క్రితం మైనింగ్  చేస్తుండగా రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజ రూపంలో లభించాయి. 

పరిశోధనల్లో ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో 1.10 కోట్ల ఏళ్ల క్రితం సంచరించి, దాదాపు 6 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన స్టెగోడాన్  జాతి ఏనుగులకు చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ ఈ చారిత్రక శిలాజాలను బిర్లా సైన్స్ సెంటర్‌‌లో ప్రదర్శించడం సింగరేణికి గర్వకారణమన్నారు. ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి ఇది మంచి అవకాశమన్నారు. 

దేశంలో సైన్స్​వ్యాప్తికి బిర్లా సైన్స్ సెంటర్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.  బీఎం బిర్లా ఇన్‌‌స్టిట్యూట్  డైరెక్టర్ కె మృత్యుంజయరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఈ అరుదైన చారిత్రక అవశేషాలను భద్రపరచి అందించడం అభినందనీయమన్నారు. గతంలో ఆదిలాబాద్‌‌లో లభించిన డైనోసార్  ఎముకలతో అస్థిపంజరాన్ని పునఃప్రతిష్ఠించగా, ఇప్పుడు స్టెగోడాన్ ఏనుగు అవశేషాలను కూడా డైనోసార్  పెవిలియన్ సమీపంలో ప్రదర్శనకు ఉంచామని తెలిపారు.

శిలాజాల ఆవిష్కరణ నేపథ్యం

గోదావరి నది సమీపంలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్  గనిలో తవ్వకాల సందర్భంగా ఉద్యోగులు నాలుగు పొడవైన దంతాలను గుర్తించారు. పరిశోధనల్లో అవి 1.10 కోట్ల సంవత్సరాల నాటి స్టెగోడాన్  జాతి ఏనుగులకు చెందినవని తేలింది. ఈ ఏనుగులు సుమారు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువు ఉండేవని, దంతాలు 12 అడుగుల పొడవు వరకూ ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి అవశేషాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం నర్మదా ఉపనది ప్రాంతం సహా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే లభించాయి. సింగరేణి యాజమాన్యం ఈ దంతాలలో ఒక జతను బిర్లా సైన్స్  మ్యూజియంకు, మరో జతను నెహ్రూ జూలాజికల్  పార్క్‌‌కు 
అందజేసింది.