అంధ బాలిక అర్జీతో..అందివచ్చిన అక్షరం అంధ విద్యార్థుల కోసం స్పెషల్ స్కూల్ 

 అంధ బాలిక అర్జీతో..అందివచ్చిన అక్షరం అంధ విద్యార్థుల కోసం స్పెషల్ స్కూల్ 
  • గ్రీవెన్స్ లో ఓ బాలిక అర్జీకి స్పందించిన కలెక్టర్ అనుదీప్​
  • ఖమ్మం జడ్పీ సెంటర్​ లో రూ.18 లక్షలతో ఏర్పాటు
  • టైల్స్, బెంచ్​లు, బుక్స్, ఆట వస్తువులు.. అన్ని ప్రత్యేకమే
  • ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు

ఖమ్మం, వెలుగు:  అంధ విద్యార్థుల కోసం అత్యున్నత సౌకర్యాలతో ఖమ్మంలో ప్రత్యేక పాఠశాల రెడీ అవుతోంది. జడ్పీ సెంటర్ కు సమీపంలోని నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.18 లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో ఓ బాధిత విద్యార్థిని గ్రీవెన్స్ లో ఇచ్చిన అర్జీపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక చొరవ చూపడంతో ఈ స్కూల్ ఏర్పాటవుతోంది. స్కూల్ ఆవరణలో వేసే టైల్స్, బెంచీలు, బుక్స్, క్లాస్ రూమ్ లోపలి గోడలు, ఆట వస్తువులు అన్నీ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేయిస్తున్నారు.

జిల్లాలో 15 మంది వరకు అంధ విద్యార్థులున్నారని, వారంతా ఇక్కడ అవకాశాల్లేక హైదరాబాద్ లో చదువుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలోనే ఈ స్కూల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం కరుణగిరికి చెందిన పది సంవత్సరాల గిడుటూరి దుర్గాభవానికి చిన్నప్పటి నుంచే కంటి చూపు లేదు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేసినా, అక్కడ సరిగా చదువు చెప్పకపోవడంతో ఆమెను హైదరాబాద్ లోని దేవనగరి స్కూల్ హాస్టల్ లో చేర్చారు. అక్కడ ఉండలేక, ఆ చిన్నారి ఖమ్మం తిరిగి వచ్చింది.

తన పరిస్థితిపై గతేడాది ఆగస్టు మొదటివారంలో కలెక్టర్ కు అర్జీ పెట్టుకుంది. దీంతో ఖమ్మంలో స్పెషల్ స్కూల్ ఏర్పాటుకు కలెక్టర్​ అనుదీప్ చొరవ చూపించారు. నగరంలోని పలు స్కూళ్లను పరిశీలించిన తర్వాత, జడ్పీ సెంటర్ లో ఏర్పాటుకు నిర్ణయించి, నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. బ్యారియర్లు లేకుండా ప్రవేశ మార్గాలు, అంతర్గత గదుల రూపకల్పన, అంధులకు దారి తెలిసేలా ప్రత్యేక టైల్స్, టాయిలెట్స్, తరగతి గదుల్లో కింద దెబ్బ తగలకుండా రబ్బర్ షీట్, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాట్లు, మ్యూజికల్ రూం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. పలుమార్లు పనులు జరుగుతున్న తీరును కలెక్టర్ అనుదీప్ పరిశీలించి, ప్రత్యేక సూచనలు చేశారు. 

స్టూడెంట్స్ కోసం స్పెషల్ డివైజ్​..!

చూపులేని పిల్లలు సరదాగా, ఆడుతూ పాడుతూ బ్రెయిలీ నేర్చుకునేందుకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఆనీ బ్రెయిలీ లీటరరీ డివైజ్ లను రూ.5 లక్షలతో ఐదు తెప్పించారు. దీని ద్వారా బ్రెయిలీ లిపి చదవటం, టైప్ చేయటం, రాయటం నేర్పడం చాలా సులభంగా ఉంటుంది. పాఠశాలలో బ్రెయిలీ లిపి పుస్తకాలు, ఆడియో బుక్స్, లెర్నింగ్ డివైజ్‌‌లు అందుబాటులో ఉంచుతున్నారు. విద్యుత్ సప్లయ్ లో ప్రమాదావకాశం లేకుండా చైల్డ్​ -సేఫ్ స్విచ్‌‌లు, అనుకూలమైన లైటింగ్ సిస్టమ్ ప్లాన్​ చేశారు. క్లాస్ రూమ్ లోపలికి గోడలకు స్పర్శ తెలిసేలా టెక్స్చర్ ఉన్న వాల్ క్లౌడింగ్ టైల్స్ ను గుజరాత్ నుంచి తెప్పించారు. 

ప్రత్యేక స్కూల్ ఏర్పాటు సంతోషంగా ఉంది..

ఏడు నెలలకే పుట్టడంతో మా అమ్మాయికి చిన్నప్పటి నుంచే చూపులేదు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించినా, ఫలితం లేదు. గతేడాది హైదరాబాద్ దేవనగరి స్కూల్, హాస్టల్ లో జాయిన్ చేస్తే, అక్కడ ఉండలేక తిరిగి వచ్చింది. ఆగస్టులో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి, అంధ విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులపై అర్జీ పెట్టుకున్నాం. స్పందించిన కలెక్టర్​ ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చి, దాన్ని అమలు చేయడం సంతోషంగా ఉంది. మా అమ్మాయితో పాటు జిల్లాలో ఉన్న చాలా మంది చిన్నారులకు ఈ స్కూల్ ఉపయోగకరంగా ఉంటుంది. - గిడుటూరి ఝాన్సీ, ఖమ్మం

అంధ విద్యార్థులు ఉపయోగించుకోవాలి.. 

జిల్లాలో అంధ విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా కల్పిస్తున్న సెన్సరీ రూమ్, సెన్సరీ గార్డెన్ లు అంధ విద్యార్థుల్లో స్పర్శ, శబ్ధం, వాసన, దిశ అవగాహన, సమతౌల్యం వంటి సామర్థ్యాలను పెంచుతాయి. ప్రత్యేక విద్యా మోడళ్లను ఆధారంగా తీసుకుని ఈ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు 15 మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరేందుకు ముందుకు వచ్చారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాలకు చెందిన నలుగురు స్పెషలైజ్డ్ టీచర్లకు ఇక్కడ డ్యూటీలు కేటాయించాం.  - అనుదీప్​ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్​