స్పీడున్నోడు

స్పీడున్నోడు

అది 2017-18 రంజీ సీజన్‌‌. ఇండోర్‌‌ హోల్కర్‌‌ స్టేడియంలో ఢిల్లీ-విదర్భ మధ్య ఫైనల్‌‌ మ్యాచ్‌‌. కాస్త పొడవుగా.. బక్కపలుచని దేహంతో ఉన్న ఓ బౌలర్‌‌ మెరుపు వేగంతో బంతులు వేస్తుంటే అంతా ఆశ్చర్యపోయారు..! ఆ సీజన్‌‌ మొత్తం అద్భుతంగా రాణించిన అతని పేస్‌‌ బౌలింగ్‌‌కు ఫిదా అయిన సెలెక్టర్లు 2018లోనే టెస్టు జట్టుకు ఎంపిక చేశారు..!
ఆ వేగాన్ని చూసే గత ఐపీఎల్‌‌లో బెంగళూరు టీమ్‌‌ అతనికి మూడు కోట్లు ముట్టజెప్పింది..! ఆ స్పీడుతోనే అతను వన్డేతో పాటు టీ20లోనూ అరంగేట్రం చేశాడు..! ఇప్పుడు ఆ పేస్‌‌కు మరిన్ని ఆయుధాలు తోడవడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది..! అంతటి స్పీడుతో దూసుకొస్తున్న పేసర్‌‌ మరెవరో కాదు నవ్‌‌దీప్‌‌ సైనీ. హోల్కర్‌‌ స్టేడియంలో శ్రీలంకతో సెకండ్‌‌ టీ20లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసిన సైనీ టీమిండియా ఫ్యూచర్‌‌ స్టార్‌‌గా కనిపిస్తున్నాడు..!

ఇండియా క్రికెట్‌‌ గతేడాది అన్ని రకాలుగా ముందంజ వేసింది. ముఖ్యంగా ఫాస్ట్‌‌ బౌలర్లు గొప్పగా రాణించారు. స్వదేశంలో స్పిన్నర్లను తలదన్నేలా విజృంభించారు. టెస్టుల్లో మరింత పవర్‌‌ఫుల్‌‌ బౌలింగ్‌‌తో అదరగొట్టారు. మహ్మద్‌‌ షమీ అండ్‌‌ కో టెస్టుల్లో లాస్ట్‌‌ ఇయర్‌‌ 15.16 యావరేజ్‌‌తో 95 వికెట్లు పడగొట్టారు. వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌లో జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, షమీ వరల్డ్‌‌ కప్‌‌లో చెలరేగిపోతే.. ఏడాది చివర్లో దీపక్‌‌ చహర్‌‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు నవ్‌‌దీప్‌‌ సైనీ వంతొచ్చింది. టీమిండియాపై తనదైన ముద్ర వేసేందుకు 27 ఏళ్ల ఈ ఢిల్లీ యువ పేసర్‌‌ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు. 2020లో ఇండియా ఆడిన ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే  సెన్సేషనల్‌‌ బౌలింగ్‌‌ (4–0–18–2)తో సైనీ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. బ్యాటింగ్‌‌కు అనుకూలమైన పిచ్‌‌పై పర్‌‌ఫెక్ట్‌‌ బౌలింగ్‌‌తో శ్రీలంక బ్యాట్స్‌‌మెన్‌‌ను వణికించి.. ఇండియా విజయానికి పునాది వేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. నవ్‌‌దీప్‌‌ ప్రధాన బలం పేస్‌‌. ఎలాంటి మిస్టేక్‌‌ లేకుండా మెరుపు వేగంతో బంతిని విసరడంలో అతను సిద్ధహస్తుడు. లాంగ్‌‌ రనప్‌‌, స్మూత్‌‌ యాక్షన్‌‌, బాల్‌‌ను రిలీజ్‌‌ చేసే టైమ్‌‌లో అద్భుతమైన ఆర్మ్‌‌ -స్పీడ్‌‌.. అన్నీ కలగలిసి ప్రస్తుత వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా సైనీని నిలుపుతున్నాయి. బుమ్రా మాదిరిగా ఈ యువ స్పీడ్‌‌స్టార్‌‌ బౌలింగ్‌‌లో మిస్టరీ ఏమీ లేదు. ఉన్నదల్లా వేగం, కచ్చితత్వమే. గత మ్యాచ్‌‌లో అతను సంధించిన బాల్స్‌‌ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. మంగళవారం రాత్రి అత్యధికంగా 151.6 కి.మి స్పీడుతో ఓ బాల్‌‌ వేశాడు. మ్యాచ్‌‌లో అతని యావరేజ్‌‌ స్పీడ్‌‌ 141 అంటే ఆశ్చర్య పోవాల్సిందే. దనుష్క గుణతిలకను ఔట్‌‌ చేసిన యార్కర్‌‌ 147.5 వేగంతో దూసుకొచ్చింది. అలాగే, 144 కి.మి. వేగంతో విసిరిన ఓ బౌన్సర్‌‌కు ఒషాడ ఫెర్నాండో బిత్తరపోయాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులే ఇచ్చిన అతను 13 డాట్‌‌ బాల్స్‌‌ వేసి కెప్టెన్‌‌ మెప్పు పొందాడు.  గతేడాది లాడర్‌‌హిల్‌‌లో వెస్టిండీస్‌‌పై ఫస్ట్‌‌ టీ20లోనే ఆకట్టుకున్న సైనీ.. డిసెంబర్‌‌లో  కటక్‌‌లో విండీస్‌‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌‌లో ఓ బౌన్సర్‌‌తో నికోలస్‌‌ పూరన్‌‌ను ఔట్‌‌ చేయడంతో పాటు నిలకడైన పేస్‌‌తో మెప్పించాడు.

వేగం ఒక్కటే సరిపోదని..

శ్రీలంకతో సెకండ్‌‌ టీ20లో నవ్‌‌దీప్‌‌ వేగం చూస్తే ఫ్యాన్స్‌‌కు 1990ల్లో కొంత మంది మేటి పేసర్ల బౌలింగ్‌‌ను గుర్తుకు తెచ్చిందనొచ్చు. అతని బౌలింగ్‌‌లో వేగం ఎప్పటి నుంచో ఉంది. కొన్ని రోజుల వరకు కేవలం పేస్‌‌తో అతను నెట్టుకొచ్చాడు. అయితే, గత ఐపీఎల్‌‌లో  సైనీ  బౌలింగ్‌‌ చూసిన చాలా మంది అతని పేస్‌‌ను ముందుగానే పసిగొట్టొచ్చని, బ్యాట్స్‌‌మెన్‌‌ కౌంటర్‌‌ అటాక్‌‌ కూడా చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు. పెద్దగా వైవిధ్యం లేకుండా ఒకే లైన్‌‌పై వేగంగా దూసుకొచ్చే బాల్‌‌ను బ్యాట్స్‌‌మెన్‌‌ అంతే వేగంతో బౌండ్రీలైన్‌‌ దాటించారు కూడా. దాంతో, బ్యాట్స్‌‌మెన్‌‌ను సర్‌‌ప్రైజ్‌‌ చేసేలా వైవిధ్యమైన బాల్స్‌‌ వేస్తేనే తన ప్రధాన ఆయుధమైన పేస్‌‌ మరింత పవర్‌‌ఫుల్‌‌గా మారుతుందని సైనీ గ్రహించాడు. కట్టర్స్‌‌తో పాటు యార్కర్లు, బౌన్సర్లతో తన బౌలింగ్‌‌ను ఓ పర్‌‌ఫెక్ట్‌‌ కాంబినేషన్‌‌గా, సర్‌‌ప్రైజ్‌‌ ప్యాకేజ్‌‌గా  మార్చుకున్నాడు. ఎప్పుడు ఎలాంటి డెలివరీ వేస్తాడో అని బ్యాట్స్‌‌మెన్‌‌ ఆలోచించేలా చేసిన సైనీ.. అనేక వేరియేషన్స్‌‌తో బౌలింగ్‌‌ చేస్తూ ఫలితం రాబడుతున్నాడు. దానికి గత మ్యాచ్‌‌లో భానుక రాజపక్సను ఔట్‌‌ చేసిన విధానం మంచి ఎగ్జాంపుల్‌‌. ఓసారి 106 కి.మి. వేగంతో ఆఫ్‌‌ కట్టర్‌‌ సంధించి ఎడ్జ్‌‌ రాబట్టిన సైనీ.. ఆ తర్వాత లెంగ్త్‌‌ తగ్గించి 144 కి.మి. వేగంతో రాకెట్‌‌ లాంటి లిఫ్టర్‌‌ వేశాడు. ఈ వైవిధ్యాన్ని ఊహించలేకపోయిన రాజపక్స బాడీపై కి దూసుకొచ్చిన బంతిని పుల్‌‌ చేసే ప్రయత్నం చేయగా… అది గ్లోవ్స్‌‌ను తాకి కీపర్‌‌ చేతిలో పడింది. తన బౌలింగ్‌‌ మాదిరిగా వేగంగా నేర్చుకునే సైనీ పొరపాట్లను సరిదిద్దుకోవడంలోనూ ముందుంటాడు. ఈ మ్యాచ్‌‌లో తొలి ఓవర్లో బుమ్రా ఏడు రన్స్‌‌ ఇచ్చిన తర్వాత ఫస్ట్‌‌ ఛేంజ్‌‌ బౌలర్‌‌గా బంతి అందుకున్న అతను ఆరంభంలో లెంగ్త్‌‌ విషయంలో ఇబ్బంది పడ్డాడు. తన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు సహా 10 రన్స్‌‌ ఇచ్చాడు. కానీ, ఎనిమిదో ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన నవ్‌‌దీప్‌‌ ఓ డిఫరెంట్‌‌ బౌలర్‌‌గా కనిపించాడు. కుశాల్‌‌ పెరీరాకు రెండు షార్ట్‌‌ బాల్స్‌‌ విసిరి ఒకే రన్‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే క్రీజు ముందుకొచ్చి ఆడబోయిన గుణతిలకకు మరో షార్ట్‌‌ బాల్‌‌ వేసిన సైనీ.. వెంటనే కళ్లు చెదిరే యార్కర్‌‌తో వికెట్ పడగొట్టి ఆశ్చర్యపరిచాడు. పరిస్థితులకు తగ్గట్టుగా.. చాలా వేగంగా తనను తాను మార్చుకోవడం సక్సెస్‌‌ బౌలర్‌‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణం. అది సైనీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మ్యాచ్‌‌కు ముందు అందరి దృష్టి  రీఎంట్రీ ఇస్తున్న జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాపై ఉండగా.. ఆట ముగిశాక అందరూ తన గురించి మాట్లాడేలా చేసుకున్నాడతను. దీపక్‌‌ చహర్‌‌, భువనేశ్వర్‌‌ కుమార్‌‌ గాయాలతో జట్టుకు దూరమైన టైమ్‌‌లో వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుంటున్న సైనీ వారికి పోటీగా మారాడు. తాను బ్యాకప్‌‌ బౌలర్‌‌ను మాత్రమే కాదు.. అంతకుమించి అనేలా చేసిన నవ్‌‌దీప్‌‌ నిలకడగా రాణిస్తే జట్టులో రెగ్యులర్‌‌ ప్లేయర్‌‌ కాగలడు-

‘టీ20 క్రికెట్‌లో సైనీ ప్రత్యేకం.  ఎందుకంటే అతను డొమెస్టిక్‌ క్రికెట్‌లో సత్తాచాటి ఐపీఎల్‌కు ఎంపికై.. అక్కడ తానేంటో నిరూపించుకొని ఇండియా టీమ్‌లోకి వచ్చాడు. అందుకే అతనికి లైన్‌ అండ్‌ లెంగ్త్​పై మంచి అవగాహన ఉంది. దాంతోనే  మంచి పేస్‌  రాబడుతున్నాడు

-విరాట్​ కోహ్లీ