నవ్వుకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ సత్యనారాయణ

నవ్వుకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ సత్యనారాయణ

నవ్వడం తేలికే. కానీ ఎదుటివారిని నవ్వేలా చేయడం చాలా కష్టం. అందుకే నవ్వించడం ఒక యోగం అన్నారు. ఆ మాటని మంత్రంలా జపించిన వ్యక్తి ఈవీవీ సత్యనారాయణ. జంధ్యాల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని అంతగా నవ్వించిన దర్శకుడెవరు అని అడిగితే, టక్కున గుర్తొచ్చేది ఆయన శిష్యుడైన ఈవీవీ. ఇది ఏ ఒక్కరు చెప్తున్న మాటో కాదు.. ఆయన కామెడీ టైమింగ్, పంచ్ ల గురించి తెలిసిన ప్రతీ తెలుగు ప్రేక్షకుడూ చెప్పేది ఆయన పేరే. దశాబ్దాల పాటు టాలీవుడ్ ఆడియెన్స్ ను నవ్వుల జల్లుల్లో తడిపిన ఈవీవీ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన (జూన్ 10) జయంతి సందర్భంగా  "ఈవీవీ"ని స్మరించుకుంటూ.... మరిన్ని విషయాలు..

కోరుమామిడి నుంచి కోట్లాదిమంది హృదయాల్లోకి..

ఈవీవీ సినిమాలు గమనిస్తే ఎక్కువగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. పాత్రలన్నీ స్వచ్ఛంగాను, అమాయకంగాను అనిపిస్తుంటాయి. దానికి కారణం.. ఆయన పుట్టి పెరిగిన వాతావరణమే. పశ్చిమ గోదావరి జిల్లా, కోరుమామిడిలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు ఈవీవీ. పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఇంటర్మీడియెట్ లో ఉండగానే ఆయన మనసు సినిమాల వైపు మళ్లింది. ఆ పిచ్చితో చదువులో వెనకబడటంతో చదువు మాన్పించి పొలం పనులు అప్పగించారు వాళ్ల నాన్న. పంతొమ్మిదేళ్లకే పెళ్లయ్యింది. చూస్తూండగానే ఇద్దరు కొడుకులు పుట్టారు. కొన్నాళ్లకు వ్యవసాయం సరిగ్గా సాగక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సినిమాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఈవీవీ. నిర్మాత నవత కృష్ణంరాజు తన ఫ్రెండ్ కి మేనమామ కావడంతో ఆయన్ని కలవాలని మద్రాస్ వెళ్లారు. కానీ అవకాశం దొరకలేదు. అయినా తిరిగి వెళ్లిపోకుండా అక్కడే ఉండి ఈవీవీ ప్రయత్నాలు కొనసాగించారు. నెల రోజుల పాటు రోజూ పొద్దున్నే తన గేటు ముందు నిలబడుతున్న ఈవీవీని చూసి చివరికి నువ్వేమవుతావని అడిగారట నవత కృష్ణంరాజు. అసిస్టెంట్ డైరెక్టర్ అవుతానని చెప్పడంతో దేవదాసు కనకాల దగ్గర చేర్పించారాయన. అలా ‘ఓ ఇంటి భాగోతం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ఈవీవీ. 

ఓటమి నుంచి గెలుపు దాకా..

హాస్యరస చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే జంధ్యాల దగ్గర చాలా ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈవీవీ పనిచేశారు. అందుకే ఆయనపై గురువు ప్రభావం చాలా ఉంది. దర్శకుడిగా మొదటి సినిమాని ఆ జోనర్ నే ఎంచుకోవడానికి కారణం కూడా అదే. అయితే రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. దాంతో ఇక సినిమాలు వదిలేయాలనుకున్నారు. బాధతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి సమయంలో అదృష్టం రామానాయుడు గారి రూపంలో వచ్చింది. పిలిచి మరీ ‘ప్రేమఖైదీ’ని డైరెక్ట్ చేసే చాన్స్ ఇచ్చారాయన. ఆ సినిమా సూపర్ హిట్. ఇక ఇంకేముంది.. ఆ ఒక్క ఛాన్స్ ఈవీవీని వెనుదిరిగి చూసుకోకుండా చేసింది. 

నవ్వుల గుళికలెన్నో!

‘ప్రేమఖైదీ’ సినిమా తన కెరీర్ ని, జీవితాన్ని మలుపు తిప్పినా.. ఆ వెంటనే మరో లవ్ స్టోరీనో, సీరియస్ సబ్జెక్టునో ఎంచుకోలేదు ఈవీవీ. మళ్లీ కామెడీ వైపే మొగ్గు చూపారు. రాజేంద్ర ప్రసాద్ తో ‘అప్పుల అప్పారావు’ తీశారు. ప్రేక్షకుల్ని పగలబడి నవ్వేలా చేశారు. ఆ తర్వాత ఆ ఒక్కటీ అడక్కు, జంబలకిడి పంబ, ఆలీబాబా అరడజను దొంగలు, వీడెవడండీ బాబూ లాంటి ఎన్నో ఫన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించారు. తన కొడుకు అల్లరి నరేష్ ని కూడా కామెడీ హీరోగానే అందరికీ పరిచయం చేశారు ఈవీవీ. తనతో తొట్టిగ్యాంగ్, కితకితలు, అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావు ఆర్ఎంపీ లాంటి సినిమాలు తీశారు. తన పెద్ద కొడుకుతో తీసిన హాయ్, ఎవడిగోల వాడిది చిత్రాల్లో కూడా ఫన్ కే పెద్ద పీట వేశారాయన. కొడుకులిద్దరినీ కలిపి తీసిన ‘నువ్వంటే నాకిష్టం’ మూవీ బేసిగ్గా లవ్ స్టోరీయే అయినా, దానికి మించిన కామెడీని చూపించారు. ఏ సినిమా తీసినా దానిలో తన నవ్వుల సంతకం ఉండాలనేది ఈవీవీ ఫీలింగ్. 

స్టార్ అయినా సరే..

ఒకప్పుడు కామెడీ సినిమాలు చేయడానికి సెపరేట్ హీరోలు ఉండేవారు. రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి వారంతా కామెడీ సినిమాలతోనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఈవీవీ వచ్చాక ఈ ట్రెండ్ మారింది. ప్రతి హీరో కామెడీ చేయాల్సిందే అన్నట్టుండేవి ఆయన కాన్సెప్టులు. స్టార్ హీరోలతో సైతం అద్భుతమైన కామెడీ చేయించారాయన. ‘హలోబ్రదర్’ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి నాగార్జున పూయించిన నవ్వుల పువ్వులు ఇప్పటికీ తాజాగానే ఉంటాయి. అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రాల్లో బ్రహ్మీతో కలిసి వెంకటేష్ చేసిన కామెడీ గుర్తొస్తే ఇప్పటికీ ప్రేక్షకుల పొట్టలు చెక్కలవుతావుతాయంటే అతిశయోక్తి కాదు. ‘అల్లుడా మజాకా’లో మెగాస్టార్ తోనూ ఫన్ గేమ్ ఆడించారు ఈవీవీ. ‘గొప్పింటి అల్లుడు’లో బాలకృష్ణ తన స్టైల్లో కామెడీని పండించే ప్రయత్నం చేశారు. హీరో ఎవరైనా.. ఈవీవీ ప్రాజెక్ట్ లోకి ఎంటరవగానే ఫన్ రైడ్ కి రెడీ అవ్వాల్సిందే.

పాత్ర చిత్రణ ప్రత్యేకం

‘జంబలకిడి పంబ’ సినిమాని చాలామంది తప్పు పట్టారు. చీప్ కామెడీ అని, ఆడవాళ్లను మగాళ్లుగా, మగవాళ్లను ఆడాళ్లుగా చూపించడం వల్గర్ గా ఉందని కామెంట్ చేశారు. కానీ ఆ సినిమా ఎన్ని నవ్వులు పండించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. దానికి కారణం కచ్చితంగా పాత్రల్ని తీర్చిదిద్దిన విధానమే. తన భార్య చనిపోతే తెల్లచీర కట్టుకుంటాడు బ్రహ్మానందం. మెడలో మంగళసూత్రం వేసుకుని కోట శ్రీనివాసరావు తులసికోట చుట్టూ తిరుగుతుంటాడు. వాళ్ల హావభావాలు చూసి నవ్వని ప్రేక్షకుడు లేడు. ‘అలీబాబా అరడజను దొంగలు’ సినిమాలో హీరోని పిరికి పోలీసుగా చూపించడం.. ‘ఆమె’లో కోటని పినాసిగా చిత్రీకరించిన విధానం అందరికీ నచ్చాయి. అలాగని కామెడీ క్యారెక్టర్సే కాదు, సీరియస్ రోల్స్ ను డిజైన్ చేయడంలోనూ ఈవీవీ రూటే సెపరేటు. అందుకే ఇప్పటికీ మిడిల్ క్లాస్ అనగానే ‘అమ్మో ఒకటో తారీఖు’లో ఎల్బీ శ్రీరామ్ పాత్ర కళ్లముందు కనబడుతుంది. హీరోయిన్ ని వేధించే దుర్మార్గపు బావగా ‘ఆమె’లోని తనికెళ్ల భరణి పాత్ర అందరికీ గుర్తుండిపోయింది. ‘రొయ్యలనాయుడు’గా రావుగోపాల రావుని కూడా ప్రేక్షకుల మనసుల్లో ముద్రపడిపోయేలా చేసిన ఘనత ఈవీవీదే. 

సర్వం కామెడీమయం

కాన్సెప్టుల్లోనే కాదు.. ఈవీవీ టైటిల్స్ లోనే కామెడీ ఉండేది. సీరియస్ టైటిల్స్ కాకుండా, జనాల నోళ్లలో ఈజీగా ఆడే పేర్లు సెలెక్ట్ చేసేవారాయన. మొదటి సినిమాకే ‘చెవిలో పువ్వు’ అని పెట్టారు. ఇక ఆ తర్వాత జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆ ఒక్కటీ అడక్కు, ఆయనకి ఇద్దరు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, చిలక్కొట్టుడు, ఆవిడా మా ఆవిడే, వీడెవడండీ బాబూ, వీడెక్కడి మొగుడండీ, పెళ్లయింది కానీ, ఫిట్టింగ్ మాస్టర్.. ఇలా తన టైటిల్స్ కి కూడా ఫన్ టచ్ ఇచ్చేవారు ఈవీవీ. టైటిల్ కార్డ్స్ వేసేటప్పుడు కూడా రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఓ సినిమాకి మామూలు టైటిల్స్ కాకుండా వాళ్లు చేసే పనిని అచ్చ తెలుగులో వేశారు. రైటర్ ని రాసేవాడు అని, మేకప్ ఆర్టిస్టుని రంగేసేటోడు అని, మ్యూజిక్ డైరెక్టర్ ని డబ్బు వాయించేవాడు అని, ప్రొడ్యూసర్ ని డబ్బులు ఖర్చు పెట్టేవాడు అని.. ఇలా. ఇక డైలాగ్స్ లో కూడా కొత్త ట్రెండ్ సృష్టంచారు ఈవీవీ. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రాజేంద్ర ప్రసాద్ చదివావులే చందమామ, తిన్నావులే ఆవకాయ అంటూ ప్రతిదానికీ ఏదో ఒక మాట అంటుంటాడు. ‘అప్పుల అప్పారావు’లో ‘అప్పు డే తెల్లారిందా’ అంటూ ఒక రకమైన విరుపుతో డైలాగ్ చెబుతాడు. ఏం చేసినా అందులో హ్యూమర్ ఉండేలా చూసుకోవడం ఈవీవీకే చెల్లింది. 


 
ఏడిపించడమూ తెలుసు

ఈవీవీకి కడుపుబ్బ నవ్వించడమే కాదు.. కంటికి ధారగా ఏడిపించడం కూడా తెలుసు. ఎంత ఫన్ కి ప్రయారిటీ ఇచ్చినా.. మధ్యమధ్యలో సీరియస్ కాన్సెప్టుల్ని కూడా టచ్ చేశారాయన. వినోద్ కుమార్, రోజా జంటగా నటించిన ‘సీతారత్నంగారి అబ్బాయి’ సినిమా మొదట కామెడీ మూవీలా అనిపిస్తుంది. కానీ కథలోకి వెళ్లేకొద్దీ బలమైన ఎమోషన్స్ ప్రేక్షకుల్ని చుట్టేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే కంటతడి పెట్టిస్తుంది. ‘కన్యాదానం’ కూడా అంతే. భార్య మీద ఎంతో ప్రేమ ఉన్నా, ఆమెని ప్రేమించినవాడికి దగ్గర చేయడానికి హీరో పడే యాతన అందరినీ కదిలిస్తుంది. ఇవన్నీ ఒకెత్తత్తయితే... ఆమె, అమ్మో ఒకటో తారీఖు చిత్రాలు మరొకెత్తు. మొదటి సినిమా ఒక ఆడపిల్ల జీవితంలోని సవాళ్లను చూపించి మనసుల్ని మెలిపెడితే.. రెండోది మధ్య తరగతి జీవితాల్లోని కష్టాలను, కన్నీళ్లను చూపించి గుండెల్ని  పిండేస్తుంది. ఆనందాన్నీ, విషాదాన్నీ కూడా స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించగలిగే దర్శకుడిగా ఈవీవీకి పేరు తెచ్చిపెట్టాయి ఈ సినిమాలు. 

    

చిరస్మరణీయుడు

ఈవీవీ గురించి, ఆయన సినిమాల గురించి ఇలా ఎంత చెప్పుకున్నా, ఏమని వర్ణించినా తనివి తీరదు. ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడమే లక్ష్యంగా జీవించిన వ్యక్తి ఆయన. తన కామెడీతో ఎంతో మందికి నవ్వడం నేర్పిన ఈవీవీ... ఉన్నట్టుండి ఒకానొకరోజు అందరినీ ఏడిపించి వెళ్లిపోయారు. కానీ తన సినిమాల రూపంలో జీవితానికి సరిపడా నవ్వుల్ని ఇచ్చి వెళ్లారు. అవి ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల పెదవుల్ని విచ్చుకునేలానే చేస్తునే ఉంటాయి. ఈవీవీని గుర్తు చేస్తూనే ఉన్నాయి.