రెస్టారెంట్‌లో కాఫీ ఆర్డర్ చేస్తే సాసర్‌లో కాఫీ కప్పు పెట్టి ఇస్తారు. కొన్నిచోట్ల కాఫీ పైన టాపింగ్ చేసి మరీ ఇస్తారు. అయితే ఇండోనేషియాలోని ఆచేకు వెళ్తే అక్కడ కాఫీ కప్పుని బోర్లించి ఇస్తారు. అదెలా తాగుతారు! అనుకుంటున్నారా. అదే ‘కుపీకోప్’ కాఫీ ప్రత్యేకత మరి. ఇండోనేషియాలోని వెస్ట్ ఆచే ప్రాంతంలో కుపీకోప్ కాఫీ చాలా ఫేమస్. అక్కడి రెస్టారెంట్లలో కుపీకోప్ కాఫీ ఆర్డర్ చేస్తే సాసర్‌లో కప్పు బోర్లించి ఇస్తారు.
అయితే బోర్లించినప్పుడు కాఫీ కిందకు పోకుండా ఉండేందుకు బరువైన గాజు గ్లాసులను వాడతారు. అయినప్పటికీ కొద్దికొద్దిగా కప్పులోంచి కాఫీ సాసర్‌లోకి జారుతుంటుంది. అలా జారిపడే కాఫీని స్ట్రాతో తాగాలి. ఇదే కుపీకోప్ కాపీ స్పెషాలిటీ. సరిగ్గా తాగడం తెలియకపోతే కాఫీ మొత్తం సాసర్‌లోకి వచ్చేస్తుంది. అయితే ఇదేదో మార్కెటింగ్ కోసం చేసే గిమ్మిక్ కాదు. ఈ కాఫీకి చాలా ఏండ్ల చరిత్ర ఉందట. కుపీకోప్ కాఫీ అక్కడివాళ్ల సాంప్రదాయంలో భాగం.
