సమయమంతా వేడుకల నిర్వహణకే వెచ్చిస్తున్నరు

సమయమంతా వేడుకల నిర్వహణకే వెచ్చిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: గత నెల రోజులుగా కలెక్టర్లు ప్రభుత్వ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణకే సరిపోతున్నారు. ఆ మధ్య స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, మొన్న జాతీయ సమైఖ్యత కార్యక్రమాలు, ఇపుడు బతుకమ్మ ఉత్సవాలు.. ఇలా సమయమంతా వేడుకల నిర్వహణకే వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో ఆయా జిల్లాల్లో అసలు సమస్యలు, ప్రజల ఇబ్బందులు పరిష్కృతం కావడం లేదు. కేంద్రంలోని బీజేపీతో దీటుగా రాష్ట్ర సర్కారు పోటాపోటీ వేడుకలు నిర్వహించడం ఇబ్బందిగా మారిందంటూ కలెక్టర్లు, ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. సర్కారు తీరుతో ప్రజా సంబంధిత, పాలనపరమైన అనేక పనులు పెండింగ్​లో పడుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

సెప్టెంబర్​ 17 వేడుకలు

కేంద్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట అధికారికంగా నిర్వహించింది. కేంద్రం ఆ ప్రకటన చేసిన ఒక్క రోజు తర్వాత తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 16 నుంచి18 వరకు వేడుకలు చేయాలని, కేంద్రం కంటే ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ల పై ఒత్తిడి తీసుకొచ్చింది. అన్ని పనులు పక్కన పెట్టి కలెక్టర్లు సమైక్యత వేడుకలు నిర్వహించారు. సాధారణ రోజుల్లోనే కలెక్టర్లు అనేక పనులతో బిజీ బిజీగా ఉంటారు. సీఎస్ లాంటి ఉన్నత స్థాయి ఆఫీసర్లు, మంత్రులు నిర్వహించే రివ్యూలకు, వీడియో కాన్ఫరెన్స్ లకు అటెండ్ కావాల్సి ఉంటుంది. జిల్లా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, ధరణి, మంత్రులు , ఎమ్మెల్యేలు జిల్లాలకు వస్తే వారితో పాటు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇపుడు పోటాపోటీ ప్రభుత్వ వేడుకలు, కార్యక్రమాలు పెడుతుండటం కలెక్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మరో వైపు ఆయా జిల్లాల్లో ప్రజల సమస్యలు పెండింగ్​లో పడుతున్నాయి.

వజ్రోత్సవాల సమయంలో..

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య వజ్రోత్సవాలను నిర్వహించింది. కేంద్రానికి ధీటుగా వేడుకలు నిర్వహించి, ఆ క్రెడిట్​ను తన ఖాతాలో వేసుకోవాలని రాష్ట్ర సర్కారు ప్రయత్నం చేసింది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించే బాధ్యతలను కలెక్టర్ల చేతిలో పెట్టింది. దీంతో వారు దాదాపు15 రోజుల పాటు అవే కార్యక్రమాల ఏర్పాట్లకు పరిమితమయ్యారు. దీంతో ధరణి, వీఆర్ఏల ఆందోళన, ఆసరా పెన్షన్​లు ఇలా అనేక సమస్యలు మూలకు పడ్డాయి. ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలు కాకుండా వేరేవి పట్టించుకుంటే పోస్టు మార్పులు తప్పవని కూడా ప్రభుత్వం కలెక్టర్లను హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అందుకే ప్రభుత్వ తీరుపై కొంతమంది కలెక్టర్లు మండిపడుతున్నారు. అటు చేయాల్సిన పని చేయలేక, ఇటు ప్రభుత్వ వేడుకల విషయంలో ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక నానా పాట్లు పడుతున్నట్లు వాపోతున్నారు.