అమెరికాకు చెందిన ప్రముఖ అల్ట్రా-లో-కాస్ట్ విమానయాన సంస్థ 'స్పిరిట్ ఎయిర్‌లైన్స్' కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సంస్థను గట్టెక్కించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో.. మేనేజ్‌మెంట్ విమానాలన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టులకు రావొద్దంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మనుగడ సాగించడానికి సుమారు రూ. 4వేల 200 కోట్లు నిధుల అవసరం పడింది. అయితే అటు ప్రభుత్వం నుంచి గానీ.. ఇటు పెట్టుబడిదారుల నుంచి గానీ ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. పెరిగిన ఇంధన ధరలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, పోటీని తట్టుకోలేక ఈ సంస్థ చేతులెత్తేసింది. గతంలో రెండుసార్లు దివాళా పిటిషన్ దాఖలు చేసిన ఈ సంస్థకు.. ఈసారి మాత్రం అదృష్టం కలిసిరాలేదు.
హఠాత్తుగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. టికెట్ బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని కంపెనీ చెబుతున్నప్పటికీ.. దానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు. మరోవైపు ఈ మూసివేత వల్ల వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. బడ్జెట్ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సేవలను నిలిపేయటంతో అమెరికాలోని ఇతర విమానయాన సంస్థలు చార్జీలు పెంచే అవకాశం ఉంది.
