మంథని, వెలుగు : 'రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కొనుగోలు చేస్తాం, ఎవరూ అధైర్యపడొద్దు' అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లోని వడ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాసంగి సీజన్‌లో దిగుబడి ఎక్కువగా రావడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యే వరకు రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే వ్యవసాయం పండుగలా మారిందన్నారు. తడిసిన వడ్లను సైతం ప్రభుత్వమే కొని, మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వర్షాలు చెప్పి రావని, వాతావరణ మార్పుల వల్లే వర్షాలు పడుతున్నాయని, అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడడం బాధగా ఉందన్నారు.
రైతులను పడుతున్న బాధలను సైతం ప్రతిపక్షాలు రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోలను పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. మంత్రి వెంట ఆర్డీవో సురేశ్, ఏడీఏ అంజనీ మిశ్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఉన్నారు.
