
హైదరాబాద్, వెలుగు: పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయాలని ఆశిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో పోటీ పడనుంది. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన అక్షర్ పటేల్ సేన ఈ పోరులో తప్పకుండా నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, గత పోరులో గాయపడ్డ కెప్టెన్ అక్షర్ పాల్గొనడంపై అనుమానాలున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఐదో ప్లేస్‌లో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే ఇన్‌ఫామ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. సన్‌రైజర్స్ బౌలర్లు కమిన్స్, షమీ, హర్షల్ పటేల్‌ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక, మిచెల్ స్టార్క్, చమీర, ముకేష్ కుమార్‌లతో కూడిన ఢిల్లీ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు గుజరాత్‌తో గత పోరులో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో నిరాశపరుస్తోంది. ఈ పోరులో అయినా హైదరాబాద్ మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తుందేమో చూడాలి.