11న శ్రీశైలం భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం

11న శ్రీశైలం భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం

శ్రీశైలం,వెలుగు: శ్రీశైలంలో ఈనెల 11 న భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ,పోలీస్,ఆర్టీసీ అధికారులతో ఆలయ ఈవో లవన్న ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామని ఈవో లవన్న తెలిపారు.

క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు,పక్షు బలులు జరగకుండా బందో బస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు. తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని పోలీస్, రెవెన్యూ అధికారులను కోరారు. కుంభోత్సవం రోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేసేలా కలెక్టర్​ను కోరుతామని దేవస్థానం ఈవో చెప్పారు.