V6 News

నారసింహుడి జయంతి ఉత్సవాలు ప్రారంభం

నారసింహుడి జయంతి ఉత్సవాలు ప్రారంభం
  • స్వామివారికి తిరువేంకటపతి 
  • అలంకార సేవ నిర్వహించిన అర్చకులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, విశ్వక్సేనపూజ, రుత్విక్‌‌‌‌‌‌‌‌వరణం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ప్రధానాలయాన్ని మంత్రజలంతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామి వారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవతో యాగశాల ప్రవేశం చేసి మండప ద్వారతోరణ పూజ, అగ్నిప్రతిష్ఠ, మూర్తికుంభ ఆరాధన, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు.

సాయంత్రం స్వామి వారికి తిరువేంకటపతి సేవను నిర్వహించి, ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. జయంతి ఉత్సవాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు, టెంపుల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఏఈవో శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలను ఐదు రోజుల పాటు రద్దు చేశారు. అలాగే పాతగుట్ట ఆలయంలో  సోమవారం నుంచి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా కొండపైన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. 

జయంతి ఉత్సవాల్లో నేడు..

నారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన నిర్వహించనున్నారు. సాయంత్రం కాళీయమర్దన అలంకార సేవ, సాయమారాధన, నిత్య హవనం, లక్ష్మీనరసింహ సుదర్శన, మూలమంత్ర హోమాలు నిర్వహించనున్నారు.