శ్రీలంకలో ఆహార కొరత.. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ 

శ్రీలంకలో ఆహార కొరత.. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ 

ద్వీప దేశం శ్రీలంక రణ భూమిని తలపిస్తోంది. తినడానికి తిండి దొరక్కపోవడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. రోజు రోజుకు అక్కడి పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. నిత్యావసర సరుకుల కోసం రోడ్లపై బారులు తీరుతున్నారు. సరుకుల కోసం కొందరైతే ఏకంగా దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. ఇంకొందరు కష్టాలను తట్టుకోలేక దేశం దాటి వెళ్లిపోతున్నారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. 

అధ్యక్ష భవనం ముట్టడి హింసాత్మకం

ఈ తరుణంలో గురువారం అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనం ముందు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ర్యాలీగా వెళ్లిన వేల మంది నిరసనకారులు.. అధ్యక్షుడు రాజపక్సె రాజీనామా చేయాలని నినాదాలతో హోరెత్తించారు. దాదాపు ఐదు వేలమందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేయడంతో హింస చెలరేగింది. దాంతో పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు, బాటిళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పే క్రమంలో పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్‌లు ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ఆందోళనకారులు పలు పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనల్లో పాల్గొన్న 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనను అడ్డుకోకపోయి ఉంటే నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడి చేసేవాళ్లని అధికారులు తెలిపారు.

పలుప్రాంతాల్లో కర్ఫ్యూ

పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు నార్త్ కొలంబో, కొలంబో సెంట్రల్, నుగేగోడ, మౌంట్ లావినియా, కెలనియా డివిజన్లలో 144 సెక్షన్ విధించారు. నిరసనకారుల ఆందోళనలు చేసిన సమయంలో రాజపక్సె అధ్యక్ష భవనంలో లేరని, ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది.

కరెంట్ కోతలతో చీకట్లో మగ్గుతున్న ప్రజలు 

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెకు ముందుచూపు లేకపోవడంతో దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జల విద్యుత్ కొరతతో ఆ దేశం విద్యుత్‌ కోతలు ఎదుర్కొంటోంది. రోజుకు 13 గంటల పాటు కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ ఆదా చేసేందుకు దేశవ్యాప్తంగా వీధి దీపాలను కూడా ఆర్పేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇక డీజిల్‌ కొరతతో వేలాది వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి. మందులు లేక డాక్టర్లు ఆపరేషన్లను సైతం ఆపేశారు. వీటన్నింటి కారణంగా లంక కొన్ని రోజులుగా దుర్భేద్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.

నిత్యావసరాల కొరత.. ఆకాశాన్నంటిన ధరలు

నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయి. ఆఖరికి మంచి నీళ్లు కూడా బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేపర్లు లేక విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేశారంటే.. లంక సంక్షోభాన్ని అంచనా వేసుకోవచ్చు. మరోవైపు ఆహార కొరత ఏర్పడటంతో పలువురు పౌరులు సరుకుల కోసం దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు దేశంలో ఎప్పుడూ చూడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎందుకొచ్చింది?

శ్రీలంకకు ప్రధాన ఆదాయ మార్గం టూరిజం. కరోనా ఎఫెక్ట్‎తో ఆ దేశం పూర్తిగా కుదేలైపోయింది. కరోనాకు ముందు పర్యాటకరంగం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లింది. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో టూరిజానికి భారీ దెబ్బ పడింది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. వీటికి తోడు మార్చి 2020లో దిగుమతుల్ని నిషేధిస్తూ.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లంక పాలిట శాపంగా మారింది. ఫారిన్‌కరెన్సీని పొదుపు చేసి.. 51 బిలియన్‌ డాలర్ల అప్పుల్ని తీర్చాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసి కొట్టింది. అయితే బయటి దేశాల నుంచి అప్పులు తెచ్చి అయినా సరే పరిస్థితిని అదుపులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది. కుటుంబపాలనతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడంటూ అధ్యక్షుడిపై లంక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు

మనసుకి హాయినిచ్చే ఎత్తిపోతల