తెలంగాణలో శ్రీలంక తరహా కుటుంబ పాలన

తెలంగాణలో శ్రీలంక తరహా కుటుంబ పాలన
  • అసెంబ్లీ రద్దు చేసే దమ్ము కేసీఆర్కు ఉందా..?
  • ఈ క్షణంలో రద్దు చేయండి.. మేము ఎన్నికలకు సిద్ధం
  • పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో శ్రీలంక తరహా కుటుంబ పాలన సాగుతోందని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అక్కడ రాజపక్స కుటుంబానికి పట్టిన గతే ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి పడుతుందని అన్నారు.  గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. గోదావరి వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ని ఏర్పాటు చేసిందని ఉత్తమ్ వెల్లడించారు. 

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయండి

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. కేసీఆర్ పాలనా తీరుపై ఉత్తమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతి పార్టీ వాళ్లు.. వారికి అనుకూలంగా సర్వే చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన కేసీఆర్కు అసెంబ్లీ రద్దు చేసే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఈ క్షణంలో అసెంబ్లీ రద్దు చేయాలని.. తాము ఎన్నికలకు సిద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు.

విద్యావ్యవస్థ నాశనం

కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ సర్వ నాశమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 12 లక్షల మంది విద్యార్థులకు 3,270 కోట్లు బాకీ పడ్డ టీఆర్ఎస్ సర్కారు 2020 - 22  ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఇంత వరకు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారని వాపోయారు.  మైనార్టీ విద్యా సంస్థల్లో 90 శాతం మూతపడ్డాయని, 2014 నుండి ఇప్పటి వరకు 1.2 లక్షల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చెప్పిన కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ఉత్తమ్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 850 జూనియర్ కాలేజీలు, 350 డిగ్రీ , 150 పీజీ కాలేజీలతో పాటు వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు మూతపడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ హాయాంలో 100శాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఉత్తమ్.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి 

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు అప్పులకుప్పగా మారి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద 26 వేల ప్రభుత్వ బడులను ఎంపిక చేశారని.. రూ.3,497 కోట్లు ఖర్చు చేస్తామని ఇంత వరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు కేవలం 10 మంది మాత్రమే డీఈఓలు ఉన్నారని వివరించారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం విద్యా వ్యవస్థ మీద అతి తక్కువ ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణనే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.