శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం ఆలయం వైభవంగా ముస్తాబయ్యింది. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రామాలయం తో పాటు ఆలయ ప్రాకారాలను వివిధ రకాల రంగులతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు కన్నుల పండుగగా కనిపించే విధంగా మిరుమిట్లు గోలుపుతూ అంగరంగ వైభవంగా శోభాయమానంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు ముస్తాబు చేశారు.
శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మార్చి 27న శ్రీసీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక, 28 న పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.
►ALSO READ | జై శ్రీరాం.. రాములోరి కళ్యాణం.. ఇంటింటా వేడుకలు..
మిథిలా స్టేడియంలో అశేష భక్త జనసందోహం మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లుచేసింది. సుమారు 3 లక్షల స్వామివారి లడ్డు ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కూడా సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
