భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో కల్యాణ రాముడికి మహదాశీర్వచనాన్ని వేదపండితులు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని వేదోక్తంగా చేశారు. సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే సదస్యం పరమార్ధం.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి చతుర్వేద పండితులు, ద్రవిడ దివ్యప్రబంధ పారాయణం చేసేందుకు తరలివచ్చి భద్రాద్రి రాముడికి తమ వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. అంతకుముందు కల్యాణమూర్తులను నిత్య కల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత హంసవాహనంపై తిరువీధి సేవగా స్వామివారు వెళ్లారు. రాజవీధి గుండా తాతగుడి సెంటర్‍లోని గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకుని తిరిగి ఆలయానికి వచ్చారు.
