- అయోధ్య రామ మందిర ట్రస్టీ శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామి
- ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీ పాదపూజ
- హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, వెలుగు: పిల్లలకు సంస్కారాన్ని నామకరణం నుంచే నేర్పాలని పెజావర్ మఠం పీఠాధిపతి, అయోధ్య రామ మందిర ట్రస్సీ శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అన్నారు. భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీ పాద పూజ భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో పాటుగా వివిధ శాఖ ఉన్నతాధికారులు, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. స్వామీజీకి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ భూషణం చేస్తూ... గతంలో పిల్లలకు రామ, కృష్ణ, కేశవ, గోవింద, శంకర వంటి అర్థవంతమైన పేర్లు పెట్టేవారని గుర్తుచేశఆరు.
ఆ పేర్ల ద్వారానే వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి మన సంస్కృతి, వారసత్వంతో పిల్లలకు సహజమైన అనుబంధం ఏర్పడేదని స్వామీజీ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో కుటుంబ విలువలను పెంపొందించడంతోపాటుగా.. కొత్త తరానికి మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను పరిచయం చేయడంపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ఒక గొప్ప మైలురాయని గుర్తు చేశారు. ‘రామమందిరంతో మన ప్రయాణం ఆగిపోకూడదు.. రామరాజ్యం దిశగా ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ.. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడి సద్గుణాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఇతరుల బాధను తన బాధగా.. ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా భావించినప్పుడే రామరాజ్య భావన సాకారమవుతుందని స్వామీజీ పేర్కొన్నారు.
