ముంబై: ఐఐటీ బాంబే బీటెక్ సెకండియర్ విద్యార్థి సాహిల్ వాకోడే సూసైడ్ కేసుకు సంబంధించి ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. సాహిల్ వాకోడేపై కుల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసినట్టు నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేదా మెటీరియల్ ఏవీ లభించలేదని వెల్లడించాయి.
అయితే , ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఘటన జరిగిన రోజు పరీక్ష హాల్‌లో ఏం జరిగింది, ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ హెడ్ కార్యాలయంలో జరిగిన పరిణామాలపై ప్రొఫెసర్లను విచారిస్తున్నాయి.
పరీక్షా సమయంలో సాహిల్ కాపీ కొడుతూ పట్టుబడటంతో ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని ప్రొఫెసర్, ఇన్విజిలేటర్ సూర్యనారాయణ దూళ్ల కోరినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సాహిల్ నేరుగా తన హాస్టల్ గదికి వెళ్లినట్టు ఆ వీడియోలో రికార్డైంది.
డీన్ పదవి నుంచి తప్పుకున్న ప్రొఫెసర్
క్యాంపస్‌లో తమ కుమారుడికి కుల వివక్ష ఎదురుకావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని సాహిల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, విచారణ సజావుగా, పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు.
