- ఐటీడీఏల ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఉచిత వసతి, కోచింగ్
- ఒక్కో ఐటీడీఏ నుంచి వంద మంది అభ్యర్థుల ఎంపిక
- త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ట్రైబల్ డిపార్ట్‌మెంట్
- గతంలో 375 మందికి శిక్షణ
హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేలా ట్రైబల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఏజెన్సీ అభ్యర్థులకు 3 నెలలపాటు ఉచిత వసతి, శిక్షణ అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న ట్రైబల్ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో వీరికి ఉచిత వసతి కల్పించనున్నారు.
వచ్చే నెల ఒకటి నుంచి ఈ ట్రైనింగ్ ప్రారంభంకానుంది. 7,437 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇప్పటికే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే డిసెంబర్ 20న రాత పరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఏజెన్సీ అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఒక్కో ఐటీడీఏకు వంద మంది ఎంపిక..
భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు (నాగర్‌కర్నూలు)లో ఐటీడీఏలు ఉన్నాయి. ఒక్కో ఐటీడీఏ నుంచి వంద మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆసక్తి, అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగుల నుంచి అప్లికేషన్లు స్వీకరించేందుకు ఈ వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకవేళ వంద కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో 3 నెలలపాటు ఉచిత కోచింగ్ అందిస్తారు. అభ్యర్థులకు క్లాసులు చెప్పేందుకు సబ్జెక్ట్ టీచర్లను పార్ట్‌టైమర్లుగా తీసుకుంటారు, ఫిజికల్ టెస్ట్‌ల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి స్పోర్ట్స్ అథారిటీకి చెందిన పీఈటీ టీచర్ల సేవలను వినియోగించుకుంటామని అధికారులు వెల్లడించారు.
గత ట్రైనింగ్ సక్సెస్..
గిరిజన సంక్షేమశాఖ గతంలో నిర్వహించిన ఉచిత శిక్షణా కార్యక్రమాలకు విశేష స్పందనతోపాటు మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత రిక్రూట్‌మెంట్ సమయంలో ట్రైబల్ శాఖ తరఫున 375 మంది ఏజెన్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా, అందులో ఏకంగా 175 మంది పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులను విజేతలుగా తీర్చిదిద్దాలని గిరిజన సంక్షేమశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
