- ఉదయం 6:30 నుంచి 8:45 మధ్యే బడులకు టిఫిన్ డెలివరీ
- మధ్యాహ్నం 12 దాటితే ఇండెంట్ మార్పునకు నో ఛాన్స్
- సర్కారు బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్ స్కీమ్ గైడ్‌లైన్స్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఉదయం 9:30 గంటల్లోపే విద్యార్థులు టిఫిన్ తినడం, పాలు తాగడం పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఉదయం 6:30 నుంచి 8:45 గంటల మధ్యే బడులకు టిఫిన్ డెలివరీ చేయాలని ఎన్జీవోలను ఆదేశించింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అమలు చేస్తున్న ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్’ స్కీమ్ నిర్వహణపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
ప్రస్తుతం 13 సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి 3 వేలకుపైగా బడులకు టిఫిన్ అందుతోంది. విడతల వారీగా అక్టోబర్ నెలాఖరులోగా అన్ని బడుల్లో ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. టిఫిన్ డెలివరీ, వడ్డన, సమయపాలనలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆహారం చల్లారకుండా, నాణ్యత దెబ్బతినకుండా 4 నుంచి 5 గంటల పాటు వేడిని నిలుపుకొనే ఇన్సులేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లోనే టిఫిన్ సరఫరా చేయాలని ఎన్జీవోలను ఆదేశించారు.
పాత్రల భద్రత కోసం ప్రతి బడిలో తాళం వేసే ప్రత్యేక గదిని కేటాయించాలని, రెండు తాళం చెవుల్లో ఒకటి ఎన్జీవో డెలివరీ బాయ్, మరొకటి హెచ్‌ఎం వద్ద ఉండాలన్నారు. వడ్డించే సమయంలో హెచ్‌ఎం గది తెరిచి, సీసీహెచ్ సిబ్బంది సాయంతో పాత్రలను బయటకు తేవాలని, ఆహారాన్ని వేరే పాత్రల్లోకి మార్చకుండా, వచ్చిన బాక్సుల నుంచే నిర్ణీత కొలత గరిటెలతో వడ్డించాలని చెప్పారు.
ముందురోజే ఇండెంట్
మరుసటి రోజు ఎంతమంది విద్యార్థులకు టిఫిన్ కావాలో హెచ్‌ఎంలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల్లోగా మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇండెంట్ పంపాలి. బిల్లులు ఇండెంట్ ఆధారంగానే చెల్లించనున్నందున హాజరును కచ్చితంగా అంచనా వేయాలి. 12 గంటలు దాటితే ఇండెంట్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. ఆ తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. విజయ డైరీ పాలను వారంలో మూడు రోజులు అందించనున్నారు. పాలు అందని రోజుల్లో రాగిజావ ఇవ్వాలి. ఈ పథకం అమలయ్యే బడుల్లో టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికీ ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
