ముంబై: ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల తమ కొడుకును ముందు నుంచే కులవివక్షకు గురిచేశాడని, ఈ విషయాన్ని సాహిల్ గతంలోనే తమకు చెప్పాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అయితే, ఐఐటీలో సీటు సాధించడం కష్టం కాబట్టి ఇటువంటి విషయాల్లో సర్దుకుపోవాలని తాము చెప్పినట్టు వారు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడే మీడియాతో మాట్లాడారు.
‘‘నా కొడుకు చాలా ప్రతిభావంతుడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను క్రాక్ చేయడం సాధారణ విషయం కాదు. కానీ, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల మాత్రం మొదటి నుంచి తనపై కులవివక్ష పూరిత వ్యాఖ్యలు చేస్తూ వేధించాడు. ఐఐటీలో సీటు దక్కడం ఎంత కష్టమో మాకు తెలుసు కాబట్టి.. ఆ కష్టాలను భరించాలని మేం అతడికి సర్దిచెప్పాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులుగా తమ బిడ్డకు అండగా నిలబడి మానసికంగా మద్దతునిచ్చామని.. అదే తాము చేసిన తప్పా అని సాహిల్ తల్లి సోనాలి వాకోడే ప్రశ్నించారు. తమ కొడుకు బలవన్మరణానికి కారణం ప్రొఫెసర్ దూళ్ల అని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
