- లవ్ మ్యారేజ్ చేసుకుంటే కుటుంబాన్ని బహిష్కరించాలని నిర్ణయం
- హర్యానాలోని హిసార్ జిల్లా ఆర్యనగర్‌లో ఘటన
హిసార్ (చండీగఢ్): ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. ఒకే గ్రామానికి చెందిన యువతీయువకులు ప్రేమ వివాహం చేసుకుంటే, ఆ జంటతోపాటు వారి కుటుంబాలను కూడా సామాజికంగా బహిష్కరిస్తామంటూ హర్యానాలోని హిసార్ జిల్లా ఆర్యనగర్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది.
ఆదివారం ఆర్యనగర్‌లో గ్రామ పెద్దల సమక్షంలో సుమారు వెయ్యి మంది గ్రామస్తులు సమావేశమయ్యారు. ప్రేమ వివాహాలను సమర్థించే బంధువులు, మద్దతుదారులపై కూడా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రతిపాదించారు. ఈ నిషేధంపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఒక కమిటీ వేసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఇటీవల గ్రామంలో జరిగిన మూడు ప్రేమ వివాహాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సర్పంచ్ రత్తన్ సింగ్ మాట్లాడుతూ గ్రామస్తుల నిర్ణయంతో గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామంలో ఇటీవల జరిగిన మూడు వివాహాల్లో రెండు వేర్వేరు కులాలకు చెందినవి కాగా, ఒకటి ఒకే కులానికి చెందినదని తెలిపారు. గ్రామస్తుడు భజన్ లాల్ మాట్లాడుతూ గ్రామంలో సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వివాహాలను వ్యతిరేకించడానికి గ్రామస్తులంతా ఏకమయ్యామని చెప్పారు.
