ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేర లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడు సందర్శనలు చేయడం విడ్డూరంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మించారని, వాళ్ల హయాంలోనే అది కూలిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నారం, కన్నెపల్లి పంప్​హౌజ్‌‌లు మునిగిపోవడానికి కారణం తప్పుడు డిజైన్లే అని చెప్పారు. 2022, జులైలో కన్నెపల్లి, అన్నారం పంప్​ హౌజ్‌‌లతో పాటు , రూ.680 కోట్ల విలువైన 17 మోటార్లు నీటిలో మునిగిపోయాయని పేర్కొన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌‌ఏ) స్పష్టంగా సూచించినా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు భూగర్భ శాస్త్రవేత్తలు, డ్రోన్ సర్వేలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులతో మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతోందని, 2028 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.