- మంత్రి శ్రీధర్ బాబు
ఎల్బీనగర్, వెలుగు: ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. 123 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు జిల్లా వ్యాప్తంగా 3,716 మంది నిరుద్యోగులు హాజరుకాగా, 779 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 1,645 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు.
ఏఐ, ఐటీ, ఉత్పత్తి, రవాణా రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. డీఈఈటీ ద్వారా నిరుద్యోగులు, పరిశ్రమల మధ్య వారధిగా ఉంటూ మరిన్ని అవకాశాలు సృష్టిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.
