
కౌలాలంపూర్: ఇండియా సీనియర్ షట్లర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఆరేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరుకున్నాడు. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–18, 24–22తో 23వ ర్యాంకర్ యుషి తనక (జపాన్) పై వరుస గేమ్స్‌లో విజయం సాధించాడు.
ఆదివారం అతను చైనాకు చెందిన రెండో సీడ్ లి షి ఫెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 32 ఏండ్ల శ్రీకాంత్ చివరగా 2019 ఇండియా ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత గాయాలు, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన తెలుగు షట్లర్ ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగాడు. కానీ, అద్భుత ఆటతో అదరగొట్టిన కిడాంబి సెమీఫైనల్లో పదునైన నెట్ ప్లే, ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థి పని పట్టాడు.