
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ప్రజావసరాలకు కేటాయించాల్సిన భూమిని వెంచర్నిర్వాహకులు అక్రమంగా వారి బంధువులకు రిజిస్ట్రేషన్చేయించుకున్నారు. దాదాపు రూ.వంద కోట్ల విలువైన స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా తమ పేర్లపై మార్చుకున్నారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని శ్రీమిత్ర వెంచర్లో జరిగింది. ఈ అక్రమాల వెనుక బీఆర్ఎస్నేతలు ఉన్నట్లు తెలిసింది. వెంచర్ చేసిన డైరెక్టర్‌తో కుమ్మకై ఆర్డీవో ప్రొసీడింగ్‌తో ఈ తతంగానికి పాల్పడ్డారు.
అబ్దుల్లాపూర్ మెట్ గత తహసీల్దార్ రవీందర్ దత్తు ఈ అక్రమాలపై గతేడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదైంది. ఆర్డీవో ద్వారా అక్రమ ప్రొసీడింగ్స్తీసుకువచ్చి పార్కు స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం.
ఇద్దరు బీఆర్ఎస్మాజీ సర్పంచ్‌లు, ఓ బ్యాంకు ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిని మళ్లీ వేరొకరికి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరపాలని డీఎల్పీవో, ఎంపీవోకు ఆదేశాలు వెళ్లాయి. రిపోర్ట్ పంపడంలో తాత్సరం జరగడం అనుమానాలకు తావిస్తోంది.